ముంబై మాజీ పోలీస్ కమీషనర్ పరంబీర్ సింగ్ దాఖలు  చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ముంబై హైకోర్టులో పిటిషన్ వేసుకోవాలని సూచించింది. ముంబై పోలీస్ కమీషనర్ పదవి నుంచి తనను హోంగార్డ్స్ విభాగానికి బదిలీ చేయడంపై మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై పరంబీర్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు.

అనిల్ దేశ్‌ముఖ్ అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. తను హోంగార్డ్స్ విభాగానికి బదిలీ చేయడాన్ని కూడా పరంబీర్ సవాల్ చేశారు. 

యన హైకోర్టుకే వెళ్లాలని సూచించడంతో సింగ్ తన పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. పిటీషనర్ చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని, కానీ దీనిపై  సుప్రీంకోర్టు బదులు హైకోర్టే విచారణ చేయాలని న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, ఆర్.సుభాష్ రెడ్డిలతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది.

32 వ అధికరణం కింద సర్వోన్నత న్యాయస్థానంలో బదులు.. 226 ఆర్టికల్ కింద హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయాలని  బెంచ్ ఆదేశించింది. హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై తీవ్ర ఆరోపణలు చేసినా..ఆయనను ప్రతివాదిగా పిటిషనర్ ఎందుకు పేర్కొనలేదని ధర్మాసనం ప్రశ్నించింది.

అటు పరమ్ బీర్ సింగ్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, తమ పిటిషన్ ఉపసంహరణకు అంగీకరిస్తూ తాము ఈ రోజే దీన్ని హైకోర్టులో దాఖలు చేస్తామని తెలిపారు.