వెస్ట్ బెంగాల్ లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వర్గాల్లో వేడి పెరుగుతోంది. బెంగాల్ లో బీజేపీ పాగా వేస్తుందని వస్తున్న ఊహాగానాల మీద ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

రాబోయే ఎన్నికల్లో బీజేపీ డబల్ డిజిట్ కంటే ఎక్కువ సీట్లు సాధిస్తే తాను ట్విటర్‌ను విడిచి పెట్టేస్తానన్నారు. అంతేకాదు బీజేపీ గెలుపు అంత ఈజీ కాదని, ఈ టార్గెట్‌ను చేరుకోవడానికి కూడా బీజేపీ చాలా కష్టపడాల్సి వస్తుందని ఆయన తెలిపారు.

‘బీజేపీకి మద్దతిస్తున్న మీడియా ఎంతగా హడావుడి చేసినా...బీజేపీ రెండంకెల సంఖ్యకు మించి సీట్లు సాధించలేదన్నది వాస్తవం. ఈ ట్వీట్‌ను సేవ్ చేసుకోండి. బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే నేను ట్వీటర్‌ను వదిలేస్తా..’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. 

అంతకుముందు.. బెంగాల్ లో  బీజేపీ ఏకంగా 200 సీట్లు సాధిస్తుందంటూ అమిత్ షా ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా బెంగాల్ లో పర్యటించిన అమిత్ షా మాట్లాడుతూ  ‘నా కామెంట్స్‌ చూసి నవ్వే వాళ్లను నవ్వుకోనివ్వండి. మనం ప్లాన్ ప్రకారం పనిచేసుకుపోతే..బీజేపీ 200 సీట్ల కంటే ఎక్కువ సాధిస్తుంది’ అంటూ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ గెలిచే సీట్లు రెండంకెల సంఖ్యను కూడా దాటవంటూ ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పారు.