Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటక అసెంబ్లీలో సావర్కర్ ఫొటో.. భగ్గుమన్న ప్రతిపక్షాలు.. ఎన్నికలకు ముందు ఇదే చివరి అసెంబ్లీ సెషన్

కర్ణాటక అసెంబ్లీలో సావర్కర్ చిత్రపటాన్ని బసవరాజు బొమ్మై ప్రభుత్వం పెట్టింది. ప్రతిపక్ష నేతలను సంప్రదించకుండానే ఈ చిత్రపటాన్ని ఉంచారు. ఈ చిత్రపటం చూసిన ప్రతిపక్షం భగ్గుమన్నది. అసెంబ్లీ మెట్లపై కాంగ్రెస్ నేతలు జవహర్ లాల్ నెహ్రూ ఫొటోను పట్టుకుని నిరసనలు చేస్తున్నారు.
 

savarkar photo in assembly.. congress protest in assembly premises on opening day of session
Author
First Published Dec 19, 2022, 12:51 PM IST

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం హిందుత్వ ఐకాన్ వీడీ సావర్కర్ చిత్రపటాన్ని పెట్టింది. ప్రతిపక్షాలు దీనిపై భగ్గుమన్నాయి.  బెళగావిలో ఈ రోజు శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కానీ, అసెంబ్లీలో సావర్కర్ చిత్రపటం చూసిన ప్రతిపక్షాలు ఆందోళన బాటపట్టాయి. జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటం చేతిలో పట్టుకుని అసెంబ్లీ మెట్లపై కాంగ్రెస్ నేతలు నిరసనలు చేపట్టారు. కాంగ్రెస్ లీడర్, ప్రతిపక్ష నేత సిద్దారామయ్య సారథ్యంలో ఈ ఆందోళనలు జరుగుతున్నాయి. 

కర్ణాటక అసెంబ్లీలో వివాదాస్పదుడి చిత్రపటం పెట్టాల్సిన అవసరం ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలను తాము అడ్డుకోవాలని, నిరసనలు చేపట్టాలని ప్రభుత్వం ఆశిస్తున్నదని కాంగ్రెస్ లీడర్ డీకే శివకుమార్ తెలిపారు. ఈ సమావేశాల్లో తాము అవినీతి అంశాన్ని లేవనెత్తుతామని వారికి తెలుసు అని, అందుకే తాము నిరసన చేపట్టాలని సావర్కర్ ఫొటోను అసెంబ్లీలో అమర్చారని వివరించారు. ప్రతిపక్షాలను సంప్రదించకుండానే ఈ ఫొటో పెట్టి ఆందోళనలకు బీజం వారే వేశారని పేర్కొన్నారు. వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందు జరుగుతున్న చివరి అసెంబ్లీ సమావేశాలు ఇవే కావడం గమనార్హం.

Also Read: పురుషులకు నగ్నచిత్రాలు పంపి, బ్లాక్ మెయిల్.. కాపురంలో నిప్పులు పోసి, డబ్బులు వసూలు చేసి.. కిలేడీ అరెస్ట్..

కర్ణాటకలో సావర్కర్ కేంద్రంగా జరుగుతున్న తాజా ఎపిసోడ్ ఇది. అసెంబ్లీ సమావేశాలకు ముందు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సావర్కర్ చుట్టూ రాజకీయాలు చేస్తున్నదని కాంగ్రెస్ మండిపడుతున్నది. ఎన్నికల ముందరే అధికారంలోని బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా సావర్కర్ గురించి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నది. బెలగావిలో అతని చిత్రానికి సత్కారం చేయడం ఇందులో భాగమే అని కొందరు బీజేపీ నేతలు చెప్పారు.

ప్రస్తుతం మహారాష్ట్రతో జరుగుతున్న సరిహద్దు గొడవ కూడా బెలగావి కేంద్రంగానే జరుగుతున్నది. సావర్కర్‌కు బెలగావితో ఓ కనెక్షన్ ఉన్నది. పాకిస్తాన్ మాజీ పీఎం లియాఖత్ అలీ ఖాన్ ఢిల్లీ పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసన చేస్తాడని అతడిని అడ్డుకునే ప్రయత్నంలో సావర్కర్‌ను ముందస్తుగానే బెలగావి నుంచి అదుపులోకి తీసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios