బాబ్రీ మసీదు కూల్చివేతలో బీజేపీ సీనియర్ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి సహా తదితర నేతలను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. కానీ కొన్ని పక్షాలు కోర్టు తీర్పును తప్పు బడుతున్నాయి.

అయితే బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి జస్టిస్ లిబర్హన్ కమిటీ నివేదికగా పేర్కొంటూ మీడియాలో ప్రచురించిన కథనాలపై స్పందించారు అదనపు సొలిసిటర్ జనరల్ సత్యపాల్ జైన్. 

 

 

గురువారం సాయంత్రం వరుస ట్వీట్లు చేసిన ఆయన బాబ్రీ కూల్చివేత వ్యవహారంలో మాజీ కేంద్ర మంత్రి ఉమా భారతి ప్రమేయంపై వచ్చిన కథనాలు అవాస్తవాలని తెలిపారు. 
 

 

లిబర్హన్ కమీషన్ ఏర్పాటుకు ముందే అద్వానీ, జోషి, ఉమా భారతీలకు తాను న్యాయవాదిగా వ్యవహరించాననని జైన్ వెల్లడించారు. 14 సంవత్సరాల పాటు కమీషన్ నమోదు చేసిన ప్రతి ప్రకటన తనకు తెలుసునని ఆయన చెప్పారు.

బాబ్రీ మసీదు కూల్చివేతకు బాధ్యత వహిస్తున్నట్లు ఉమా భారతి ఎప్పుడు ప్రకటన చేయలేదని సత్యపాల్ తెలిపారు. అంతేకాకుండా చారిత్రక కట్టడాన్ని కరసేవకులు పడగొట్టకుండా ఉండేందుకు గాను అద్వానీ ఆమెను అక్కడికి పంపించారు. అయితే కరసేవకులు ఆమెను వెనక్కి పంపడంతో పాటు మళ్లీ ఇక్కడికి రావొద్దని కోరారు. 

 

 

ప్రభుత్వానికి సమర్పించిన అయోధ్య కమీషన్ ఆఫ్ ఎంక్వైరీ నివేదికలోని 10వ అధ్యాయం పేరా 125.15లో ఉమా భారతి గురించి తాను చెప్పిన ప్రతి విషయాన్ని జస్టిస్ లిబర్హన్ స్వయంగా పేర్కొన్న విషయాన్ని సత్యపాల్ జైన్ ప్రస్తావించారు. అయితే ఈ రోజు జస్టిస్ లిబర్హన్ చేసిన ప్రకటన ఆయన సమర్పించిన నివేదికకు విరుద్ధంగా ఉందని జైన్ తెలిపారు.