బెంగళూరు: తమిళ నేత, జయలలిత ప్రియ నేస్తం శశికళ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను జైలు నుంచి బెంగళూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 27వ తేదీన ఆమె జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. 

అక్రమాస్తుల కేసులో అరెస్టయిన శశికళ శిక్షాకాలం పూర్తి చేసుకుని పరప్పన జైలు నుంచి విడుదల కానున్నారు. ఆమె బంధువు, సహ నిందితురాలు ఇళవరసి ఇంకా కొంత కాలం జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది. 

శశికళ, ఇళవరసి, మరో బంధువు విఎన్ సుధాకర్ లు 2017 ఫిబ్రవరి నుంచి పరప్పన జైలులో ఉంటున్నారు. ఈ కేసులో ఇళవరసి కన్నా కొంత ముందే శశికళ అరెస్టయి జైలు జీవితం గడిపారు. దీంతో ఆమె విడుదల కానున్నారు. 

ఇతరత్రా కస్టడీ రోజులను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ నెల 27వ తేదీతో ఆమె శిక్షాకాలం ముగుస్తుందని జైలు అధికారులు చెప్పారు శశికళ, ఇళవరసి జరిమానాల కింద తలో 10 కోట్ల రూపాయలు చెల్లించారు సుధాకర్ మాత్రం చెల్లించలేదని సమాచారం.