దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ ఆస్తులు జప్తు అవుతాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది చెన్నై వర్గాల్లో. అక్రమాస్తుల కేసులో జయలలిత, శశికళ, సుధాకరన్, ఇళవరసిలకు సుప్రీంకోర్టు 4 సంవత్సరాల జైలు శిక్షతో పాటు తలా రూ.10 కోట్లు జరిమానా విధించింది.

అయితే జయ మరణంతో ఆమెను దోషిగా పేర్కొన్నా, కేసు నుంచి తప్పించారు. ఈ క్రమంలో 2017 ఫిబ్రవరి 15న సాయంత్రం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు శశికళ, ఇళవరసి, సుధాకరన్ లొంగిపోయారు.

అప్పటి నుంచి చిన్నమ్మ జైలుకే పరిమితమైపోయారు, శనివారంతో వీరి శిక్ష రెండేళ్లే పూర్తి చేసుకుంది. మిగిలిన రెండేళ్ల జైలు శిక్షే బ్యాలెన్స్ ఉంది. అయితే ఇంత వరకు వీరు ముగ్గురు జరిమానాను చెల్లించలేదు.

ఈ జరిమానాను తమిళనాడు ఏసీబీ నేతృత్వంలో వసూలు చేయాలా..? లేదా కేసును నడిపిన కర్ణాటక ప్రత్యేక కోర్టులో చెల్లించాలా అన్న ప్రశ్న తలెత్తడంతో ఇంతకాలం ఆ జరిమానా గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు.

సగం శిక్ష పూర్తికావడంతో తాజాగా జరిమానా వ్యవహారం తెరపైకి వచ్చింది. తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు చర్చించుకుని జరిమానా వ్యవహారంలో ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని ముగ్గురు చెల్లించని పక్షంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ముగ్గురి ఆస్తులు జప్తు చేసి జరిమానా వసూలు చేసే అవకాశం కనిపిస్తోంది.