వైవాహిక జీవితంలో సరసాలు, వ్యంగ్యం మామూలేనంటూ ముంబై సెషన్స్ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కొత్త కోడలిని అత్తామామలు, తోడికోడళ్లు, బావమరుదులు ఆటపట్టించడం మామూలేనని పేర్కొంది. తన అత్తామామలు వ్యంగ్య మాటలతో వేధిస్తున్నారని ఓ యువతి కోర్టులో కేసు వేసింది. ఈ కేసులో అత్తా మామలకు ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ, ఈ వ్యాఖ్యలు చేసింది 

ముప్పై యేళ్ల ఆ యువతి దుబాయ్‌లో పని చేస్తున్న ఓ వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఇరువురి తల్లిదండ్రులు ముంబైవాసులే. అయితే తన భర్త తన అత్తమామల సొంత కొడుకు కాదని, వారి ఇంట్లో పని చేసే మహిళకు పుట్టినవాడని, ఈ విషయం తనకు పెళ్లికి ముందు తెలియదని ఆ యువతి ఆరోపించింది. 

పని మనిషి కుమారుడిని తన అత్తమామలు దత్తత తీసుకున్నట్లు తనకు పెళ్లి తర్వాత తెలిసిందన్నారు. ఇక తాను తన అత్తమామల ఇంటికి వెళ్లిన తొలి రోజు నుంచి తనను వేధిస్తున్నారని ఆరోపించారు. తనను లివింగ్ రూమ్‌లోనే నిద్రపోయేలా చేశారని, ఇంట్లోని రిఫ్రిజిరేటర్‌ను ముట్టుకోనిచ్చేవారు కాదని తెలిపారు. తనకు పాడైపోయిన ఆహారం పెట్టేవారని తెలిపారు. తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లనిచ్చేవారు కాదన్నారు. 

ఈ విషయాలను తన భర్తకు చెప్పానని, ఆయన వ్యంగ్యంగా మాట్లాడేవారని తెలిపారు. తన తల్లిదండ్రులకు విధేయంగా ఉండాలని ఆయన చెప్పేవారన్నారు. రూ.1.5 కోట్ల విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలను తన తల్లిదండ్రులు తమకు ఇచ్చారని తెలిపారు. ఆమె అత్తమామలు ముందస్తు బెయిలు కోసం కోర్టును ఆశ్రయించారు. 

అంతేకాదు తమ కుమారుడు, ఫిర్యాదుదారు ప్రేమ వివాహం చేసుకున్నారని తెలిపారు. తమ కుమారుడు తమ దత్తపుత్రుడని ఆమెకు ముందుగానే తెలుసునని చెప్పారు. ఆమె పెళ్లయిన తర్వాత 2018లో తమ ఇంట్లో కేవలం 10 రోజులు మాత్రమే ఉన్నట్లు వివరించారు. ఆమె దుబాయ్‌లో కానీ, ముంబైలోని తన తల్లిదండ్రుల వద్ద కానీ ఉండేవారని తెలిపారు. 2019 డిసెంబరులో ఆమె తన అన్ని ఆభరణాలు, లగేజీని ముంబై తీసుకొచ్చేశారని తెలిపారు. 

ఆమెకు విడాకులు ఇచ్చేందుకు తమ కుమారుడు ప్రొసీడింగ్స్ ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కారణాల వల్ల ఆమె  తమను వేధిస్తున్నట్లు ఆరోపించారు. కోర్టు ఈ వాదనలను పరిశీలించి, 80 ఏళ్లు, 75 ఏళ్లుగల వృద్ధులైన అత్తమామలకు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. ఆమె ఆరోపణలు సాధారణ స్వభావం కలవేనని తెలిపింది. అయితే అత్తమామల పాస్‌పోర్టులను పోలీస్ స్టేషన్‌లో సమర్పించాలని ఆదేశించింది.