జమ్ము కశ్మీర్ లోయలో జీ20 సమావేశం జరుగుతున్న తరుణంలో విదేశీ ప్రతినిధులు, అధికారులకు ప్రముఖ సంతూర్ సంగీతకారుడు సాహిల్ సంతూర్ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. హోటల్‌లో ప్రతినిధులకు సంతూర్ సంగీత ప్రదర్శన ఇస్తున్నారు. కశ్మీర్ సాంప్రదాయానికి చెందిన సంతూర్ పరికరంతో శ్రావ్యమైన సంగీతాన్ని అందించనున్నారు. 

Srinagar: కశ్మీర్ లోయలో జీ 20 సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. మంగళవారం మొదలవుతున్న టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం రెండు రోజులపాటు జరుగుతుంది. ఈ సమావేశాలకు సుమారు 100 మంది విదేశీ ప్రతినిధులు వస్తున్నారు. వీరికి సాంస్కృతి కార్యక్రమాలూ ఏర్పాటు చేశారు. బహుభాషా సాంస్కృతి కార్యక్రమాలు అతిథుల కోసం నిర్వహిస్తున్నారు. ఇందులో కశ్మీరీ ఫోక్ మ్యూజిక్, గొజ్రి పాటలు, పంజాబీ డ్యాన్సులు ఉండనున్నాయి. ఆదివారం నుంచే ఈ సమావేశం కోసం అధికారులు, ప్రతినిధులు కశ్మీర్‌కు విచ్చేస్తున్నారు. దాల్ లేక్ సమీపంలో రెండు టాప్ హోటల్స్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ వారికి బస ఏర్పాటు చేశారు.

ఎయిర్‌పోర్టు నుంచి షేర్ ఎ కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (ఎస్‌కేఐసీసీ) వరకు గల 15 కిలోమీటర్ల దారిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారు. కొన్ని నెలల ముందే ఆ పనులు మొదలయ్యాయి. కశ్మీర్ లోయలో తొలిసారి అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహిస్తున్న తరుణంలో ఆ దారికి అదనపు హంగులు జోడించారు.

అతిథులు ఇక్కడికి ఆదివారం ఉదయం నుంచే విచ్చేస్తున్నారు. సోమవారం నుంచే ఇక్కడ కశ్మీరికి చెందిన ప్రముఖ సంగీతకారుడు, సంతూర్ వాయించే నూర్ మొహమ్మద్ భట్ ప్రదర్శన ఇస్తున్నారు. నూర్ మొహమ్మద్ భట్‌నే సాహిల్ సంతూర్‌గా పిలుచుకుంటారు. ఆయన ఈ జీ20 సమావేశం ముగిసే వరకు నాలుగు రోజులపాటు శ్రావ్యమైన సంగీతాన్ని అతిథులకు అందించనున్నారు.

లలిత్ గ్రాండ్ ప్యాలెస్‌లో సోమవారం సాయంత్రం తాను మూడు గంటల సంతూర్ సంగీతాన్ని వినిపిస్తానని ఆయన సోమవారం చెప్పారు. ఆ హోటల్ లాబీలో ఈ కార్యక్రమం ఉంటుందని వివరించారు. కశ్మీర్ ఫోక్ డ్యాన్స్, బాలీవుడ్ సాంగ్స్, హాలీవుడ్ నోట్స్ పైనా సంతూర్ మ్యూజిక్ ఉంటుందని ఆయన తెలిపారు. చాలా వరకు ప్రతినిధులు లలిత్ గ్రాండ్ ప్యాలెస్, తాజ్ వివాంత హోటల్స్‌లో ఉంటున్నారని వివరించారు. 

కశ్మీర్ మ్యూజిక్‌లో సంతూర్ సంగీత పరికరానికి ప్రాముఖ్యత ఉన్నది. ఈ పరికరం ఎక్కువగా కశ్మీరీల సూఫియానా మ్యూజిక్‌తో ఉండేదని సాహిల్ తెలిపారు. ఈ మ్యూజిక్‌ను పండిట్ శివ కుమార్ శర్మ బాలీవుడ్ మ్యూజిక్‌లో పరిచయం చేశరని వివరించారు. ఈ పరికరంలో మరో నాలుగు బ్రిడ్జ్‌లు చేర్చడంతో లో నోట్ పాటలను కూడా ఇప్పుడు వాయించవచ్చని తెలిపారు.

గత కొన్నేళ్లుగా విదేశీ పర్యాటకులు తగ్గిపోయిన కశ్మీర్ పై ఇప్పుడైనా అవగాహన మారుతుందని, త్వరలోనే విదేశీ పర్యాటకుల తాకిడి పెరుగుతుందని సాహిల్ కోరుకున్నారు. జీ 20 సదస్సు ఇక్కడ నిర్వహించడంతో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులకు కశ్మీర్ మరోసారి గమ్యస్థానంగా మారుతుందని విశ్వసిస్తున్నారు. దాల్ లేక్‌లోని హౌజ్ బోట్లు కేవలం విదేశీ పర్యాటకులకే అనేంతగా డిమాండ్ మళ్లీ రావాలని తెలిపారు.

బుడ్గా జిల్లా వతోరా ఏరియాకు చెందిన 29 ఏళ్ల సంగీతకారుడు సాహిల్ చిన్నప్పటి నుంచి సంగీత ప్రపంచంలోనే పెరిగారు. గత పదేళ్లుగా ఆయన సంగీత ప్రదర్శనలు ఇస్తున్నారు. శ్రీనగర్‌లోని పెద్ద పెద్ద హోటల్స్‌లో, అలాగే, వివాహ వేడుకల్లోనూ సంతూర్ సంగీతాన్ని వినిపిస్తున్నారు.

ఇప్పుడు పెళ్లి వేడుకల్లోనూ విరివిగా తనకు ఆహ్వానం అందుతున్నదని సాహిల్ తెలిపారు. బ్యాండ్లు, ఫాస్ట్ మ్యూజిక్ కంటే ఇప్పుడు సంతూర్ మ్యూజిక్‌కు ఆదరణ పెరుగుతున్నదని వివరిచంారు. 

మ్యూజిక్‌లో డిగ్రీ చేసిన సాహిల్ సంతూర్ కశ్మీర్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్నారు.

--- రచయిత ఎహెసాన్ ఫాజిలీ