మహారాష్ట్రలో ప్రస్తుతం ఉన్న ఎంవీఏ నాయకుల ఫోన్లు 2019 సంవత్సరంలో ట్యాపింగ్ కు గురయ్యాయని ఆ రాష్ట్ర హోం మినిస్టర్ దిలీప్ వాల్సే పాటిల్ అన్నారు. దాదాపు 60 రోజుల కంటే ఎక్కువగా ఈ ట్యాపింగ్ కొనసాగిందని ఆరోపించారు.
శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఫోన్‌ను 60 రోజులు ట్యాపింగ్ కు గురయ్యిందని మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ అన్నారు. అలాగే ఎన్సీపీ నేత ఏక్‌నాథ్ ఖడ్సే ఫోన్‌ను కూడా 67 రోజులు ట్యాప్ చేశారని అన్నారు. ఇవన్నీ 2019లో జరిగాయని అన్నారు. ఈ ఘటనల వెనుక భారతీయ జనతా పార్టీ (బీజేపీ) హస్తం ఉందని ఆయన ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ ఘటనకు సంబంధించి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వాంగ్మూలాన్ని ముంబై సైబర్ పోలీసులు గత నెలలో నమోదు చేశారు. “ ఒక పోలీసు బృందం బదిలీ, పోస్టింగ్ కేసులో నా స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసింది. నేను అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చాను. మహారాష్ట్ర ప్రభుత్వం గత ఆరు నెలలుగా ఈ కేసును పక్కన పెట్టింది. నేనే ఈ కేసులో విజిల్‌బ్లోయర్‌ని’’ అని రెండు గంటల పాటు పోలీసు విచారణ తర్వాత ఫడ్నవీస్ మీడియాకు తెలిపారు.
ఈ కేసు 2019 కేసుకు సంబంధించినది. ఇందులో ఐపీఎస్ అధికారిణి అయిన రష్మీ శుక్లా రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ (SID) చీఫ్‌గా నియమితులైన సమయంలో మహారాష్ట్ర సీనియర్ నాయకులు, అధికారుల ఫోన్‌లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమె అనుమతి లేకుండా ఫోన్‌లను ట్యాప్ చేశారని మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) నేతలు ఆరోపించారు.
కాగా ఈ విషయంలో మహారాష్ట్ర హో మినిస్టర్ నేడు మీడియాతో మాట్లాడారు. 2019 సంవత్సరంలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో తమ పార్టీ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ కు గురయ్యాయని అన్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీపై ఆయన తీవ్రంగా విమర్శలు చేశారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసం బయట MSRTC సిబ్బంది ఇటీవల నిరసనకు దిగారని, అయితే ఈ ఘటనకు ‘నాగ్‌పూర్’తో సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఈ దాడి విషయంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధఙంచి కొంతమంది జర్నలిస్టులను కూడా పోలీసులు పిలిపించారని అన్నారు. అయితే RSS ప్రధాన కార్యాలయంతో నాగ్‌పూర్ లోనే ఉంది. అలాగే ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఫడ్నవీస్ స్వస్థలం కూడా నాగ్ పూరే. ఈ రెండు విషయాల నేపథ్యంలోనే హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
