Shiv Sena: శివసేనలో చీలికకు ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు సంజయ్ రౌత్ కారణమని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ఆరోపించారు. శివసేన, ఎన్సీపీ కలిసి ఉండకపోతే ఎంవీఏ ఎప్పటికీ ఏర్పడి ఉండేది కాదని ఆయన అన్నారు.
Union Minister Ramdas Athawale: పార్టీ చీలికకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కారణమని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే ఆరోపించారు. సంజయ్ రౌత్ కోరిక మేరకే ఉద్ధవ్ థాక్రే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)తో పొత్తు పెట్టుకున్నారంటూ వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి అథవాలే ఎన్ఐతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
ఏఎన్ఐతో అథవాలే మాట్లాడుతూ.. "శివసేనను విచ్ఛిన్నం చేసింది శరద్ పవార్ కాదు.. సంజయ్ రౌత్. సంజయ్ రౌత్ కోరిక మేరకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)తో కలిసి వెళ్లాలని ఉద్ధవ్ థాక్రే నిర్ణయించుకున్నారు" అని తెలిపారు. శివసేన, ఎన్సీపీ కలిసి ఉండకపోతే మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), శివసేన ప్రభుత్వాలు వచ్చేవని కేంద్ర మంత్రి అన్నారు. శివసేన, బీజేపీ సర్కారు ఏర్పడివుంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కావని తెలిపారు.
శివసేన, ఎన్సీపీ కలసి ఉండకపోతే మహా వికాస్ అఘాడి ఎప్పటికీ ఏర్పడి ఉండేది కాదన్నారు. అలా జరిగివుంటే మహారాష్ట్రలో బీజేపీ, శివసేన ప్రభుత్వం ఏర్పడేదని అథవాలే అన్నారు. కాగా, అంతకుముందు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శివసేనను విచ్ఛిన్నం చేశారనీ, పవార్ పార్టీని ఓ క్రమపద్ధతిలో బలహీనపరిచారని మహారాష్ట్ర మాజీ మంత్రి రాందాస్ కదమ్ ఆరోపించారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 'శివసేన అధినేత కుమారుడు ఎన్సీపీ, కాంగ్రెస్ మంత్రులతో కలిసి కూర్చోవడం మాలో ఎవరికీ ఆమోదయోగ్యం కాదు. ఏక్‌నాథ్ షిండే ఈ చర్య తీసుకోకుంటే సేనకు 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఉండేవారు కాదు' అని కదమ్ అన్నారు.
“నేను 52 సంవత్సరాలు పార్టీలో పనిచేశాను. చివరికి నన్ను తొలగించారు. ఏక్‌నాథ్ షిండేతో పాటు వచ్చిన ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అని అన్నారు. ఇదిలా ఉండగా, రాహుల్ షెవాలే మాట్లాడుతూ “ఉద్ధవ్ థాక్రే.. బీజేపీతో పొత్తుకు సిద్ధంగా ఉన్నారని, ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం గంటపాటు కొనసాగింది. అయితే కొంతమంది శివసేన ఎమ్మెల్యేల ప్రతిష్టంభన కారణంగా అది ముందుకు సాగలేదని తెలిపారు. దీనిపై అథవాలే స్పందిస్తూ శివసేన.. ఎన్‌సీపీతో కలిసి వెళ్లినప్పుడు, “బాలాసాహెబ్ ఉద్ధవ్ థాక్రే నిర్ణయానికి ఇది విరుద్ధమని నేను చెప్పాను. మొదట్లో ఉదవ్ థాక్రే భాజపాతో కలిసి వచ్చి ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టి ఉంటే, ఎలాంటి ప్రతిష్టంభన ఉండేది కాదు" అని చెప్పారు.
కాగా, శివసేన రెబల్ నాయకుడు ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోని రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటు కారణంగా మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం మహా వికాస్ అఘాడీ కుప్పకూలింది. శివసేన నాయకుడు ఎన్ని బుజ్జగింపు చర్యలకు దిగినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే శివసేన రెబల్ నాయకులు, బీజేపీ తో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనూహ్యంగా శివసేన రెబల్ నాయకుడు ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా.. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
