Monkeypox: యూపీలోని ఘజియాబాద్‌లో మంకీపాక్స్ క‌ల‌క‌లం రేగింది. ఐదేంళ్ల‌ బాలిక శరీరంపై దురద, దద్దుర్లు ఉన్నాయని ఫిర్యాదు రావ‌డంతో ఆ బాలిక నుంచి న‌మూనాల‌కు సేక‌రించి.. వ్యాధిపై నిర్థార‌ణ‌ కోసం  పంపిన‌ట్టు ఘజియాబాద్‌ సీఎంఓ తెలిపారు. 

Monkeypox: కరోనా వేరియంట్లు ప్ర‌పంచ దేశాల‌ను భ‌యాందోళ‌న‌లోకి వెట్టివేస్తున్నాయి. ఇప్ప‌డిప్పుడే.. సాధార‌ణ ప‌రిస్థితులోకి అడుగుపెడుతున్నామ‌ని భావిస్తున్న తరుణంలో మంకీపాక్స్‌ రూపంలో మరో ఉపద్రవం వ‌చ్చిప‌డింది. ఈ కొత్త వైరస్‌ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఇప్ప‌టికే మంకీపాక్స్‌ను సీరియస్‌గా తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ త‌రుణంలో మంకీపాక్స్ వ్యాధిపై భార‌త‌ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. 

ఈ నేప‌థ్యంలో ఉత్తరప్రదేశ్‌లో మంకీపాక్స్‌ కలకలం రేపింది. ఘజియాబాద్ జిల్లాకు చెందిన ఓ 5 ఏళ్ల బాలిక ఒంటిపై దురద, దద్దుర్లు వంటి మంకీపాక్స్‌ లక్షణాలతో బాధపడుతున్నది. దీంతో అనుమానించిన‌ అధికారులు బాలిక నమూనాలను సేకరించి, పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. 

ఘజియాబాద్ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్ (సిఎంఓ) మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్ల బాలిక శరీరంపై దురద మరియు దద్దుర్లు వచ్చినట్లు ఫిర్యాదు అందింది. దీంతో ముందుజాగ్రత్తగా ఆమె నమూనాలను సేక‌రించి, మంకీపాక్స్ ప‌రీక్ష‌కు పంపించామని తెలిపారు. ఆ బాలిక‌కు ఇతర ఆరోగ్య సమస్యలు లేవని, అలాగే.. గత నెలలో రోజుల్లో విదేశాల‌కు ప్ర‌యాణించిన చ‌రిత్రగానీ, విదేశాల నుంచి వ‌చ్చిన వారిని క‌లిసిన సంద‌ర్భాలు లేవ‌ని తేల్చారు.

అయితే.. మంకీపాక్స్ పై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మెడికల్ చీఫ్ ఆఫీసర్ రాష్ట్రంలోని ఉన్నత ఆరోగ్య అధికారులు, జిల్లా మెజిస్ట్రేట్‌లను కోరారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్‌ఓపీలు) పాటించాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.

స్థానికేతర దేశాల్లో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన నాలుగు రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో సమగ్ర వ్యాధి నిఘా కార్యక్రమం ద్వారా వివరణాత్మక దర్యాప్తు ప్రారంభించాలని ప్రభుత్వం జిల్లా నిఘా విభాగాలను ఆదేశించింది. 

ఆఫ్రికా దేశాల్లో వెలుగులోకి వ‌చ్చిన‌ మంకీపాక్స్ క్ర‌మ‌క్రమంగా ప్రపంచ దేశాలల్లో విస్తరిస్తున్నది. ఈ క్ర‌మంలో ఫ్రాన్స్‌లో విజృంభిస్తుంది. ఈ దేశంలో శుక్రవారం ఒక్కరోజే 51 మందికి పాజిటివ్ న‌మోద‌య్యాయి. అమెరికాలో ఇప్పటివరకు 21 మంది ఈ వైరస్‌ బారినపడ్డారు. అయితే మంకీపాక్స్‌ రెండు నుంచి నాలుగు వారాల్లో తగ్గిపోతుందని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌ ప్రకటించింది.