సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ (80) అస్వస్థతకు గురయ్యారు. ఆయన అనారోగ్యానికి గురవడంతో లక్నో నగరంలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. ఉదరకోశ సమస్యతో బాధపడుతున్న ములాయంకు అన్ని రకాల వైద్యపరీక్షలు చేశామని మేదాంత ఆసుపత్రి డైరెక్టరు డాక్టర్ రాకేష్ కపూర్ చెప్పారు. 

ములాయంను పరామర్శించేందుకు అతని సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్, కోడలు డింపుల్ యాదవ్ లు ఆసుపత్రికి వచ్చారు. ములాయం ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని మేదాంత ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ రాకేష్ కపూర్ చెప్పారు.

కాగా.. గతంలోనూ పలుమార్లు ఆయన అస్వస్థతకు గురయ్యారు. గతేడాది డిసెంబర్ లో ఆయన అస్వస్థతకు గురవ్వగా ముంబయిలో చికిత్స అందించారు. కొన్ని రోజులుగా పొత్తికడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. డాక్టర్ల సూచన మేరకు ముంబై ఆసుపత్రిలో చేరినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. మూడురోజుల చికిత్స అనంతరం ఆయన అప్పుడు డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా మరోసారి అస్వస్థతకు గురయ్యారు.