Mulayam Singh Yadav: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ గురుగ్రామ్ ఆసుపత్రిలో నిపుణుల బృందం పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో ప్రస్తుతం ఆయన క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఉన్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
Samajwadi Party: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌ను ఆరోగ్యం మరింతగా క్షీణించిందని సమాచారం. ఆయన ప్రస్తుతం గురుగ్రామ్ ఆసుపత్రిలో నిపుణుల బృందం పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో ప్రస్తుతం ఆయన క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఉన్నారని మేదాంత ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సమాజ్‌వాదీ పార్టీ 82 ఏళ్ల వృద్ధుడి ఆరోగ్యం క్షీణించిందని ఆదివారం ప్రకటించిన మరుసటి రోజు ఆసుపత్రి నుండి ఈ ప్రకటన వచ్చింది. ములాయం సింగ్ యాదవ్ ఆగస్టు 22 నుండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జూలైలో కూడా ఆయన ఆసుపత్రిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
"ములాయం సింగ్ ప్రస్తుతం గుర్గావ్‌లోని మేదాంత హాస్పిటల్‌లోని క్రిటికల్ కేర్ యూనిట్‌లో చేరారు. సమగ్ర నిపుణుల బృందం చికిత్స అందిస్తోంది" అని ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్, కోడలు డింపుల్ యాదవ్, సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్ ఆదివారం ఆసుపత్రిని సందర్శించారు. కొంతమంది పార్టీ కార్యకర్తలు కూడా అతని పరిస్థితి గురించి ఆరా తీసేందుకు ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే, ఆయన ఆరోగ్యం విషయంలో మెరుగైన వైద్యం అందిస్తున్నామనీ, ఆస్పత్రిని సందర్శించవద్దని వారికి సూచించినట్లు వర్గాలు తెలిపాయి.
"గౌరవనీయమైన నేతాజీ (ములాయం సింగ్ యాదవ్) ఐసీయూలో చేరారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. ఆసుపత్రికి రావద్దని మీ అందరికీ వినయపూర్వకమైన విన్నపం. ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తాము" అని సమాజ్ వాదీ పార్టీ పేర్కొంది. ఆదివారం నాడు తన అధికారిక ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. 82 ఏళ్ల ఎస్పీ నాయకుడు ప్రస్తుతం లోక్‌సభలో మెయిన్‌పురి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మేదాంత ఆసుపత్రికి చేరుకున్నారు.
కాగా, ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లు కూడా అఖిలేష్ యాదవ్‌తో మాట్లాడి తన తండ్రి ఆరోగ్యంపై ఆరా తీశారని సమాచారం. ఎస్పీ నాయకుడి చికిత్సకు అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తానని అఖిలేష్ యాదవ్‌కు మోడీ హామీ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
