2014 సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురైనట్లు ఆరోపణలు వస్తుండటంతో దేశంలోని రాజకీయ పార్టీలు కలవరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల విధానాన్ని అమలు చేయాలని పలు పార్టీలు కోరుతున్నాయి.

తాజాగా యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సైతం బ్యాలెట్ పేపర్లను వినియోగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈవీఎంల వినియోగంపై అనుమానాలు, వివాదాలు తలెత్తుతున్న నేపథ్యంలో....లోక్‌సభ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరపాలని కోరుతున్నట్లు ఆయన ఈసీకి లేఖ రాశారు.

రాజకీయ లబ్ధి కోసం టెక్నాలజీని దుర్వినియోగపర్చవచ్చని.. బ్యాలెట్ పత్రాలు వినియోగిస్తే ప్రభుత్వానికి, సామాన్యుడికి మధ్య సత్సంబంధాలు బలపడతాయని సూచించారు. అలాగే, పోలీంగ్ సమయంలో చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, ప్రజలు బారులు తీరి నిలబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చంటూ లండన్ నుంచి సయ్యద్ షుజా చేసిన ప్రకటనపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని అఖిలేశ్ అభిప్రాయపడ్డారు.