ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ లో ఓ మహిళా కలెక్టర్ ఫోటోలు వైరల్ గా మారాయి. దీంతో.. ఆమె ఫోటోలను అందులో పెట్టిన వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా కెలక్టర్ రోహిణి పర్సనల్ ఫోటోలను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు సినిమా పాటలతో యాడ్ చేసి టిక్ టాక్ యాప్ లో పోస్టు చేశారు. ఆమెతోపాటు ఆమె కుమారుడి ఫోటోలను కూడా వివిధ రకాల సోషల్ మీడియా నెట్ వర్క్ లలో షేర్ చేశారు.

ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ రోహిణి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రోహిణి ఫోటోలతో ఉన్న టిక్‌టాక్‌ మ్యూజిక్‌ను నిషేధించే పనిలో సైబర్‌క్రైం పోలీసులు నిమగ్నమయ్యారు. రెండు రోజుల్లో నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఇదివరకే అనేక మంది రాజకీయ ప్రముఖులు టిక్‌టాక్‌ యాప్‌ను రద్దు చేయాలని కోరుతున్న స్థితిలో ప్రస్తుతం కలెక్టర్‌ ఫొటోను టిక్‌టాక్‌ ఇతర సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయడం సంచలనం కలిగించింది.