సారాంశం
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెజర్లు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రెజర్ల ఆందోళనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సాక్షి మాలిక్ రెజ్లర్ల నిరసన నుంచి తప్పుకున్నారు.
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెజర్లు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో టాప్ రెజర్లు పాల్గొంటున్నారు. అయితే తాజాగా రెజర్ల ఆందోళనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సాక్షి మాలిక్ రెజ్లర్ల నిరసన నుంచి తప్పుకున్నారు. ఆమె తిరిగి రైల్వేలో తన ఉద్యోగంలో చేరారు. అయితే గత రాత్రి భారత టాప్ రెజ్లర్లు శనివారం రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత రెజర్ల ఆందోళన నుంచి సాక్షి మాలిక్ తప్పుకోవడం గమనార్హం.
ఇక, శనివారం రాత్రి ఢిల్లీలోని అమిత్ షా నివాసంలోనే ఆయనతో సమావేశం అయ్యామని ఒలంపియన్ బజరంగ్ పునియా ఎన్డీటీవీకి వెల్లడించారు. వారి సమావేశం రాత్రి 11 గంటలకు ప్రారంభమైందని వివరించారు. ఆ భేటీ గంటపాటు సాగిందని తెలిపారు. బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, సంగీత ఫోగట్, సత్యవ్రత్ కడియన్‌లు అమిత్ షాతో భేటీ అయిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని రెజ్లర్లు హోం మంత్రి అమిత్ షాతో డిమాండ్ చేశారు. చట్టం అందరికీ సమానమేనని అమిత్ షా వారికి భరోసా ఇచ్చినట్టు తెలిసింది. చట్టం దాని పనిని చేసుకుపోనివ్వండి అంటూ రెజ్లర్లతో అన్నట్టు పునియా తెలిపారు.
ఈ భేటీ గురించి స్పందించిన సాక్షి మాలిక్ భర్త సత్యవ్రత్ కడియన్.. శనివారం హోం మంత్రి అమిత్ షాతో జరిగిన రెజ్లర్ల సమావేశం అసంపూర్తిగా ఉందని చెప్పారు. అమిత్ షా నుంచి తాము కోరుకున్న స్పందన రాలేదని అన్నారు.