భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) ఛైర్మన్ అనిల్ కుమార్ చౌదరీపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. బుధవారం రాత్రి కార్యాలయంలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా.. దక్షిణ ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో ఆయన కారును మరో కారు ఢీకొట్టింది.

దీంతో అనిల్ కారు డ్రైవర్ కిందకు దిగి.. వారిని ప్రశ్నించారు. దీంతో కారులో ఉన్న నలుగురు యువకులు ఆగ్రహంతో అనిల్, అతని కారు డ్రైవర్‌పై ఐరన్ రాడ్లతో దాడి చేశారు. ఓ యువకుడు డ్రైవర్‌ను పట్టుకోగా.. మిగిలిన ముగ్గురు అనిల్ తల, మెడ, కాళ్లపై తీవ్రంగా కొట్టారు.

ఈ సమయంలో అటుగా వెళ్తున్న పెట్రోలింగ్ పోలీసులు దాడిని చూసి వెంటనే అక్కడికి చేరుకున్నారు. అనిల్‌ను రక్షించి సదరు యువకులను అరెస్ట్ చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన సెయిల్ ఛైర్మన్‌ను హుటాహుటిన ఎయిమ్స్‌కు తరలించారు.

ఈ ఘటనపై సెయిల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇది అనుకోకుండా చేసింది కాదని.. ఎవరో ఉద్దేశ్యపూర్వకంగానే అనిల్‌పై దాడికి పాల్పడ్డారని అనుమానం వ్యక్తం చేసింది.