ఇండోర్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రత్యేక సాయుధ బలగాల్లో (ఎస్ఏఎఫ్ లో) పనిచేస్తున్న కానిస్టేబుల్, అతని భార్య హత్యకు గురయ్యారు. వారిని పదునైన ఆయుధంతో గురువారం తెల్లవారు జామున పొడిచి చంపారు. నిందితులను పోలీసులు ఇప్పటి వరకు గుర్తించలేదు. 

అయితే, ఈ కేసులో దంపతుల కూతురుని, ఆమె మిత్రుడిని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇండోర్ లోని ఏరోడ్రోమ్ పోలీసు స్టేషన్ ప్రాంతంంలోని తమ ఇంటిలో జ్యోతి ప్రసాద్ శర్మ (45), అతని భార్య నీలం (43) రక్తంతో తడిసిన దుస్తుల్లో పడి ఉన్నారు. 

పదునైన ఆయుధంతో ఇద్దరిని హతమార్చినట్లు అదనపు పోలీసు సూపరింటిండెంట్ ప్రశాంత్ చౌబే చెప్పారు. ఇంట్లోంచి పెద్దగా కేకలు వినిపిస్తున్న సమయంలో దంపతుల కూతురు ఇంటి బయట తచ్చాడుతూ కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారని ఆయన వివరించారు. 

ఇంట్లోంచి కేకలు ఎందుకువస్తున్నాయని ఇరుగుపొరుగువారు, పక్కనే నివసిస్తున్న గ్రాండ్ పేరెంట్స్ ఆమెను అడిగారు. అమ్మానాన్న గొడవ పడుతున్నారని ఆమె వారికి చెప్పింది. 

హత్య జరిగిన తర్వాత వారి కూతురు, ఆమె మిత్రుడు కనిపించకుండా పోయారు. దీంతో వారిని అనుమానిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.