Sadhvi Rithambara: దేశంలోని పలు ప్రాంతాల్లో మత ఘర్షణలు జరుగుతున్న క్రమంలో వీహెచ్‌పీ మహిళా విభాగం వ్యవస్ధాపకురాలు సాధ్వి రితంబర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ జంటలు నలుగురు పిల్లలకు జన్మనివ్వాలని, వారిలో ఇద్దరిని దేశానికి అందించాలని పిలుపు ఇచ్చారు.
Sadhvi Rithambara: దేశంలోని పలు ప్రాంతాల్లో మత ఘర్షణలు జరుగుతున్న తరుణంలో వీహెచ్‌పీ మహిళా విభాగం వ్యవస్ధాపకురాలు సాధ్వి రితంబర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతి హిందూ దంపతులు నలుగురు పిల్లలను కనాలని, వారిలో ఇద్దరిని జాతికి అంకితం చేయాలని సాధ్వి రితంబర పిలుపునిచ్చారు. అలా చేస్తే.. భారతదేశం త్వరలో 'హిందూ రాష్ట్రం'గా మారుతుందని, రాజకీయ ఉగ్రవాదం ద్వారా హిందూ సమాజాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్న వారు మట్టి కరిపిస్తామని, వారు ఉనికిని కోల్పోతారని అన్నారు.
ఢిల్లీలోని జహంగీర్‌పురిలో శనివారం జరిగిన మత హింసను ప్రస్తావిస్తూ.. హనుమాన్ జయంతి శోభా యాత్ర పై దాడి చేసిన వారు దేశం సాధించిన అభివృద్ధిని చూసి అసూయతో ఉన్నారని అన్నారు. విశ్వహిందూ పరిషత్ మహిళా విభాగం, దుర్గావాహిని వ్యవస్థాపకురాలు అయిన రితంబర ఆదివారం నిరాలా నగర్‌లో జరిగిన రామమహోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
హిందూ మహిళలు మేమిద్దరం..మాకిద్దరూ (హమ్ దో, హమారే దో) అనే సూత్రాన్ని అనుసరిస్తారనీ, అయితే హిందూ జంటలు నలుగురు సంతానానికి జన్మనివ్వాలని అభ్యర్థిస్తున్నాననీ, వీరిలో ఇద్దరిని దేశానికి అంకితం చేయాలని విజ్ఞప్తి చేశారు. హిందూ జంటలు వారి పిల్లలను ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీలకు అప్పగించాలని అన్నారు.
జహంగీర్‌పురి హింస కేసును 14 పోలీసు బృందాలు విచారిస్తున్నాయని ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్థానా తెలిపారు. ఈ దాడిలో ఎనిమిది మంది పోలీసు సిబ్బంది, ఒక పౌరుడు సహా తొమ్మిది మంది గాయపడిన ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 21 మందిని అరెస్టు చేశారు, హింసాకాండలో గాయపడిన పోలీసులను ఢిల్లీ పోలీస్ చీఫ్ పరామర్శించారు, అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే.. ఏప్రిల్ 10న రామ నవమి సందర్భంగా దేశంలోని కొన్ని ప్రాంతాలలో మతపరమైన హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి.
ఇటీవలి ద్వేషపూరిత ప్రసంగాలు, మత హింసాత్మక సంఘటనలపై విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. నేరస్థులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్‌సిపి అధినేత శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, హేమంత్ సోరెన్‌లతో సహా నేతలు సంయుక్త ప్రకటనలో ప్రధాని నరేంద్ర మోడీ ఘర్షణలపై మౌనం వహించారని మండిపడ్డారు. మతోన్మాదాన్ని ప్రచారం చేసే వారి మాటలకు, చర్యలకు వ్యతిరేకంగా మాట్లాడలేని ప్రధాని మౌనం చూసి, తమ మాటలు, చేతలతో మన సమాజాన్ని రెచ్చగొట్టే, రెచ్చగొట్టేలా మాట్లాడటంపై తాము దిగ్భ్రాంతికి గురయ్యామని పేర్కొన్నారు.
