ఆశ్చర్యం.. మెదడులో రక్తం కారుతున్నా.. శివరాత్రికి సద్గురు అంత ఉత్సాహంగా ఎలా ఉన్నారు ?
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ కు ఎమర్జెన్సీ బ్రెయిన్ సర్జరీ జరిగింది. చాలా కాలంగా ఆయన బ్రెయిన్ లో రక్త స్రావంతో బాధపడుతున్నారు. కానీ మహా శివరాత్రి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ బ్రెయిన్ కు సర్జరీ జరిగింది. ఈ విషయాన్ని మెదడుకు శస్త్రచికిత్స చేయించుకున్నారని ఈషా ఫౌండేషన్ బుధవారం ప్రకటించింది. ఆయన కోలుకుంటున్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించింది. ఆయన బ్రెయిన్ లో రక్త స్రావం జరగడంతో అపోలో హాస్పిటల్ లో వైద్య బృందం ఆపరేషన్ నిర్వహించిందని పేర్కొంది.
వాస్తవానికి సద్గురు గత నాలుగు వారాలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. అంత నొప్పి ఉన్నప్పటికీ రోజువారీ షెడ్యూల్ ప్రకారం తన సామాజిక కార్యకలాపాలను కొనసాగించారు. ఓ పక్క బ్రెయిన్ లో రక్త స్రావం జరుగుతున్నా.. ఈ నెల 8వ తేదీ నిర్వహించిన మహా శివరాత్రి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇది ఇప్పుడు ఎందరినో ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
మార్చి 15న ఆయనకు తలలో విపరీతమైన నొప్పి రావడంతో ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్‌లోని సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరినికి కాల్ చేశారు. దీంతో ఆ డాక్టర్ కు అనుమానం వచ్చి ఎంఆర్ఐకు ఆదేశించారు. దీంతో సద్గురు మెదడులో రక్తస్రావం జరుగుతోందని తేలింది. దానిని నివారించడానికి మార్చి 17వ తేదీన డాక్టర్ వినీత్ సూరి, డాక్టర్ ప్రణబ్ కుమార్, డాక్టర్ సుధీర్ త్యాగి, డాక్టర్ ఎస్. ఛటర్జీలతో కూడిన వైద్యుల బృందం సద్గురుకు ఎమర్జెన్సీ బ్రెయిన్ సర్జరీ చేసింది.
ఆపరేషన్ తరువాత ఆయనను వెంటిలేటర్ నుంచి తొలగించారు. అయితే సద్గురు బ్రెయిన్ కు ఆపరేషన్ కంటే 3-4 వారాల ముందే రక్త స్రావం జరిగిందని డాక్టర్లు గుర్తించారు. ప్రస్తుతం సద్గురు కోలుకుంటున్నారు. ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్లు తెలిపారు. బ్రెయిన్ సర్జరీ తర్వాత సద్గురు వీడియో సందేశాన్ని ఈషా ఫౌండేషన్ విడుదల చేసింది. తనకేమీ కాలేదని, ఆరోగ్యంగానే ఉన్నానని ఆయన వెల్లడించారు.