రాజస్తాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం కొద్ది రోజులుగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే సచిన్ పైలట్ నుంచి అటువంటి ప్రకటన వెలువడలేదు.
రాజస్తాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం కొద్ది రోజులుగా సాగుతున్న సంగతి తెలిసిందే. తన తండ్రి రాజేశ్ పైలట్ వర్ధంతి (జూన్ 11) సందర్భంగా సొంతూళ్లో ఏర్పాటు చేసే కార్యక్రమంలో కొత్త పార్టీపై సచిన్ పైలట్ ప్రకటన చేస్తారనే ఊహాగానాలు సాగాయి. అయితే సచిన్ పైలట్ నుంచి అటువంటి ప్రకటన వెలువడలేదు. తన తండ్రి వర్ధంతిని పురస్కరించుకుని తన స్వస్థలమైన దౌసాలో సచిన్ పైలట్ భారీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తన తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సచిన్ పైలట్ మాట్లాడుతూ.. భారతదేశంలో, రాజస్తాన్‌లో అవినీతి రాజకీయాలకు ఆస్కారం ఉండకూడదని అన్నారు. ‘‘యువతకు మంచి భవిష్యత్తు కోసం నేను మాట్లాడాను. ఇక్కడి ప్రజలు ఎప్పుడూ నాకు మద్దతు ఇస్తున్నారు. నా గొంతు బలహీనం కాదు.. నేను వెనక్కి తగ్గను, దేశానికి సత్య రాజకీయాలు అవసరం. ప్రజలు భవిష్యత్తుతో ఆడుకోవడం నాకు ఇష్టం లేదు. యువత. నా విధానం స్పష్టంగా ఉంది. నాకు స్వచ్ఛమైన రాజకీయాలు కావాలి’’ అని సచిన్ పైలట్ తెలిపారు.
బీజేపీ నాయకురాలు, మాజీ సీఎం వసుంధర రాజేను తాను వ్యతిరేకిస్తాననీ.. కానీ ఆమెపై ఎప్పుడూ కించపరిచే పదాలు ఉపయోగించలేదని సచిన్ పైలట్ చెప్పారు. సీఎం అశోక్ గెహ్లాట్‌ను ఎప్పుడూ అవమానించలేదని అన్నారు. ‘‘మన పాలనలో ఏదైనా లోపం ఉంటే.. ఇతరులను నిందించకుండా మనం దానిని సరిదిద్దుకోవాలి. నేను ఒకరి పరువు తీయడానికి నా డిమాండ్లను ముందుకు తీసుకురాలేదు. రాజకీయాల్లో మన అభిప్రాయాన్ని పెంచడం చాలా ముఖ్యం’’ సచిన్ పైలట్ అన్నారు.
ఇక, 2018లో రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటీ నుంచి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. 2020లో గెహ్లాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు సచిన్ పైలట్ నాయకత్వం వహించారు. ఆ తర్వాత ఆయనను పార్టీ రాష్ట్ర యూనిట్ అధ్యక్ష పదవి నుంచి, డిప్యూటీ సీఎం పోస్టు నుంచి తొలగించారు. గత ఏడాది రాజస్థాన్‌లో నాయకత్వ మార్పును అమలు చేయడానికి కాంగ్రెస్ నాయకత్వం చేసిన ప్రయత్నం విఫలమైంది. అశోక్ గెహ్లాట్ మద్దతుదారులు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించారు. మళ్లీ ఇటీవలి కాలంలో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ల వ్యవహారం కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.
అయితే గత వారం రాజస్తాన్ కాంగ్రెస్‌లో ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌లతో సుదీర్ఘ చర్చలు జరిపారు.
