బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు విఫలం: సచిన్ పైలట్..
హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మణిపూర్ సహా పలు రాష్ట్రాల్లో బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ విమర్శలు గుప్పించారు.

ఏడాది చివరిలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికలకు సంసిద్ధమవుతున్నాయి. ఇటీవల ప్రధాని మోదీ రాజస్థాన్‌లోని సికార్‌కు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వంతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఇలాంటి పరిస్థితిలో రాజస్థాన్ రాజకీయాలకు సెంటర్ ఆఫ్ ఆట్రాక్షన్, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ .. ప్రధాని విమర్శలను తిప్పి కొట్టారు. భాజపాపై మాటల తూటలను పేల్చాడు.
బీజేపీ ప్రభుత్వాలు విఫలం
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలు విఫలమవుతున్నట్లు కనిపిస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ శుక్రవారం అన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మణిపూర్‌లను ఉదాహరణగా చూపుతూ.. ఈ రాష్ట్రాలతో సహా అనేక ఇతర రాష్ట్రాల్లో బిజెపి యొక్క డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. దీంతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని సచిన్ పైలట్ విశ్వాసం వ్యక్తం చేశారు.రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని దీమా వ్యక్తం చేశారు.
టోంక్‌లో విలేకరులతో పైలట్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లోనూ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. టోంక్ జిల్లాలో రెండు రోజుల పర్యటనలో ఉన్న పైలట్ కృషి ఉపాజ్ మండిలో మినీ ఫుడ్ పార్క్ , ఇతర నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
"రైతుల అభ్యున్నతి కోసం కృషి "
రైతుల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కృషి చేస్తుందని, మండి వ్యవస్థను బలోపేతం చేశామని, రైతు వ్యతిరేక చట్టాలను బీజేపీ తీసుకువస్తోందని ఆరోపించారు. బీజేపీ నల్ల చట్టాలను ఉపసంహరించుకోకుంటే.. మండి వ్యవస్థ పూర్తిగా నాశనం చేయబడి రైతులు నాశనం చేయబడేవారని అన్నారు.రాజస్థాన్ అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రశంసిస్తూ.. పైలట్ పార్టీ విధానాలు, కార్యక్రమాలపై దృష్టి పెడుతుందని, ప్రభుత్వం, సంస్థను కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్పారు.
నల్లధనం ఎక్కడ?
అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం వచ్చి తొమ్మిదేళ్లు కావస్తున్నా నల్లధనాన్ని వెనక్కి తీసుకురాలేకపోయిందని, మరోవైపు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తారాస్థాయికి చేరుకుందని బీజేపీపై మండిపడ్డారు. బీజేపీ పాలనలో ఈడీ, సిబిఐ, ఆదాయపు పన్ను శాఖలను ఉపయోగించుకుని.. ప్రతిపక్షాలపై దాడులు చేశారని ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని, ప్రజలకు సంబంధించిన సమస్యలను బిజెపి పట్టించుకోవడం లేదని ఆరోపించారు.