Asianet News TeluguAsianet News Telugu

సచిన్ పైలట్, సారా అబ్దుల్లాల విడాకులు కన్ఫామ్.. వీరి లవ్ స్టోరీ ఏమిటీ? జమ్ము కశ్మీర్‌తో లింక్ ఏమిటీ?

సచిన్ పైలట్, సారా అబ్దుల్లాల విడకులు ఇప్పుడు అఫీషియల్. సారా అబ్దుల్లాకు విడాకులు ఇచ్చినట్టు సచిన్ పైలట్ తన నామినేషన్ పత్రాల్లో స్పష్టం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అమెరికాలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమ కథ గురించిన ఆసక్తి ఇప్పటికీ అనేకుల్లో ఉన్నది.
 

sachin pilot divorced his wife sara abdullah, know here how their love started in america kms
Author
First Published Oct 31, 2023, 9:37 PM IST | Last Updated Oct 31, 2023, 9:37 PM IST

జైపూర్: కొన్ని సంవత్సరాలుగా సచిన్ పైలట్, సారా అబ్దుల్లాలు విడిపోయారంటూ చర్చ జరుగుతున్నది. కథనాలూ వచ్చాయి. కానీ, వాటికి అధికారిక ధ్రువీకరణలు ఏవీ రాలేవు. దీంతో వీరి విడాకుల విషయంపై స్పష్టత రాలేదు. కానీ, తాజాగా రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల కోసం టోంక్ నియోజకవర్గం నుంచి సచిన్ పైలట్ నామినేషన్ దాఖలు వేసినప్పుడు ఈ విషయంపై స్పష్టత వచ్చింది. తన నామినేషన్ అఫిడవిట్‌లో సచిన్ పైలట్ తన భార్యతో విడాకులు అయినట్టు స్పష్టం చేశారు.

సచిన్ పైలట్ లవ్ స్టోరీ, వారి కుటుంబానికి జమ్ము కశ్మీర్‌తో ఉన్న లింక్ పైనా చాలా ఆసక్తి ఉంది. సచిన్ పైలట్ 2004లో సారా అబ్దుల్లాను పెళ్లి చేసుకున్నాడు. ఆమె ప్రభావవంత రాజకీయ నాయకుల కుటుంబానికి చెందిన మహిళ. నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా కూతురు. జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సోదరి. జమ్ము కశ్మీర్‌లో అబ్దుల్లా కుటుంబ ప్రాబల్యం గురించి చెప్పాల్సిన పని లేదు. జమ్ము కశ్మీరీల హక్కుల కోసం పోరాడిన ఉద్యమ నేతగా ఫరూఖ్ అబ్దుల్లా తండ్రి షేక్ అబ్దుల్లాకు చరిత్రలో ప్రముఖ స్థానం ఉన్నది.

వీరి మధ్య ఎలా ప్రేమ వికసించింది?

సారా అబ్దుల్లా, సచిన్ పైలట్‌ల ప్రేమ అమెరికాలో విరబూసింది. సచిన్ పైలట్ పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన వార్టన్ స్కూల్‌లో ఎంబీఏ చదివాడు. ఆ సమయంలోనే ఆయన తొలిసారి సారా అబ్దుల్లాను కలిశాడు. 

Also Read: యాపిల్ ఫోన్ సేఫా? కాదా?: హ్యాకింగ్ వాదనలపై కేంద్రమంత్రి స్పందన

వారి మధ్య పరిచయం ప్రేమగా పరిణామం చెందింది. ఈమెయిల్స్, ఫోన్ కాల్స్‌లో సంభాషించుకునేవారు. ఎంబీఏ పూర్తి చేసుకుని సచిన్ పైలట్ ఢిల్లీకి తిరిగి వచ్చినప్పటికీ సారా తన చదువులను అమెరికాలో కొనసాగించారు. వీరి మధ్య ప్రేమ సుమారు మూడు సంవత్సరాలపాటు పెరుగుతూ వచ్చింది.

పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ, ఇద్దరి మతాలు వేరు, సంస్కృతుల్లోనూ అనేక వ్యత్యాసాలు ఉన్నాయి. ఉభయ కుటుంబాలు వీరి పెళ్లికి తొలుత అంగీకరించలేదు. సచిన్ పైలట్ 2004లో తన కుటుంబాన్ని ఒప్పించగలిగాడు. 2004లో వారి పెళ్లి జరిగింది. అయితే, సారా కుటుంబం ఈ పెళ్లి వేడుకకు రాలేదు. కానీ, కాలం గడిచిన కొద్దీ వారు సారాను మళ్లీ కలుపుకున్నారు. సచిన్ పైలట్‌ను అల్లుడిగా స్వీకరించారు. ఈ దంపతులకు ఆరాన్, వెహాన్ పేర్లతో ఇద్దరు కుమారులు ఉన్నారు. సచిన్ పైలట్ తన అఫిడవిట్‌లో భార్యకు విడాకులు ఇచ్చినట్టు ధ్రువీకరించారు. ఇద్దరు పిల్లలు తనపై ఆధారపడి ఉన్నారని వివరించారు.

2014లోనే వీరు విడాకులు తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. అప్పుడు వారిద్దరూ ఆ వదంతులను ఖండించారు. 2018లో సచిన్ పైలట్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం తీసుకున్నప్పుడు సారా తన కుమారులు, ఫరూఖ్ అబ్దుల్లా సహా హాజరయ్యారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios