కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రైతుల ఉద్యమానికి పలువురు అంతర్జాతీయ ప్రముఖులు మద్ధతు పలికారు.

ఇదే సమయంలో బయటి శక్తులకు భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం అనవసరం అంటు సచిన్ టెండూల్కర్, కంగనా రనౌత్, అక్షయ్ కుమార్ వంటి వారు మండిపడ్డారు.

అయితే ఉద్యమిస్తున్న రైతులను ఏమాత్రం పట్టించుకోకుండా, మోడీ సర్కార్‌కు అనుకూలంగా సెలబ్రెటీలు ఇటీవల చేసిన ట్వీట్లపై పంజాబ్‌  కాంగ్రెస్ ఎంపీ జస్బీర్ ఎస్ గిల్ మండిపడ్డారు. సచిన్‌కు 'భారతరత్న' అవార్డుకు అనర్హుడని అన్నారు. 

రైతులను విమర్శిస్తున్న వాళ్లెవరికీ అంతరాత్మ అనేది లేదని... సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత ప్రయోజనం కోసమే ప్రభుత్వానికి వంత పాడుతున్నాడని ఆరోపించారు. తన కొడుకును ఐపీఎల్‌లో ఎంపిక చేసుకోవాలన్న తాపత్రయంతోనే ఆయన రైతు వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు గిల్ మండిపడ్డారు.

ఇక అక్షయ్ కుమార్ మేథాశక్తి ఏపాటిదో ఆయన చెబుతూ మామిడి పండ్లు తింటారా అని ప్రధానిని ఆయన అడుగుతారంటూ సెటైర్లు వేశారు. రైతు ఉద్యమం చూసి ప్రభుత్వం భయపడుతోందని.. అందుకే అక్షయ్‌తో ట్వీట్ చేయించిందని గిల్ మండిపడ్డారు.

అంతకుముందు రైతులకు మద్ధతు పలకకుండా కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడుతున్నారంటూ కేరళ కాంగ్రెస్ సచిన్ టెండూల్కర్‌పై భగ్గుమంది. దీనిలో భాగంగా ఆయనకు వ్యతిరేకంగా నిరసనల దీక్షలు చేయడంతో పాటు సచిన్ కటౌట్లపై నల్లని నూనెను పోశారు కాంగ్రెస్ నేతలు.