శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై కొన్ని సంవత్సరాలుగా వివాదం నడుస్తోంది. ఆలయంలోకి వెళ్లాలని మహిళలు.. కేవలం 50ఏళ్లు దాటిన వాళ్లు మాత్రమే వెళ్లాలని అయ్యప్ప భక్తులు వాదిస్తూనే ఉన్నారు. 

కాగా... ఆలయంలోకి 10-50ఏళ్ల మధ్య వయసు బాలికలు, మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తేస్తూ అన్ని వయసుల వారికి ప్రవేశాన్ని అనుమతిస్తూ  గతేడాది సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుపై అయ్యప్ప భక్తులు, హిందువులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.

కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ.. అయ్యప్ప భక్తులు నిరసనలు చేపట్టారు. కేరళలో రాజకీయంగా ఎదగడానికి శ్రమిస్తున్న బీజేపీ-శబరిమల వివాదాన్ని ఓ అస్త్రంగా వాడుతుండటం, దానిని నిలువరించేందుకు లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం నియంత్రించడంతో ఇదో రాజకీయ రణక్షేత్రంగానూ మారింది.

ఈ నేపథ్యంలో గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పుకి రివ్యూ పిటిషన్‌కు సుప్రీంకోర్టు అనుమతించింది. దీనిపై మొత్తం 56 పిటిషన్ల దాఖలు కాగా, చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని జస్టిస్ రోహిటన్ నారిమన్, ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హొత్రాలతో కూడి ధర్మాసనం ధర్మాసనం గురువారం ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువరించనుంది.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేరళలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. శబరిమలలో 10 వేల మంది పోలీసులను మోహరించారు. గతేడాది తీర్పు తర్వాత శబరిమలలో తలెత్తిన ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని కేరళ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. గతేడాది ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

ఫిబ్రవరి 6న రాజ్యాంగ ధర్మాసనం ఎదుట వివిధ పక్షాలకు చెందిన న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పక్కనపెట్టాలని నాయర్‌ సర్వీస్‌ సొసైటీ తరపున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది కే పరాశరన్‌ విజ్ఞప్తి చేశారు.