శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై వివాదం కొనసాగుతోంది. కాగా ఈరోజు కేరళలో బంద్ ప్రకటించారు. 

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై వివాదం కొనసాగుతోంది. కాగా ఈరోజు కేరళలో బంద్ ప్రకటించారు. శబరిమల కర్మ సమితి అనే సంస్థ సహా పలు సంఘాలు నేడు కేరళ వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. సంఘ్‌ పరివార్‌ సీనియర్‌ నేత అయిన ఓ మహిళను అరెస్ట్‌ చేయడానికి నిరసన వ్యక్తంచేస్తూ వీరు ఆందోళనకు దిగారు.

 శనివారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో హిందూ ఐక్యవేది రాష్ట్ర అధ్యక్షురాలు కేపీ శశికళను పోలీసులు అరెస్ట్‌ చేశారని వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌జేఆర్‌ కుమార్‌ ఆరోపించారు. 50ఏళ్లు దాటిన ఆమె ఇరుముడితో అయ్యప్ప దర్శనానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు.

కేరళ ప్రభుత్వం శబరిమల ఆలయాన్ని నాశనం చేయాలని భావిస్తోందని వీహెచ్‌పీ నేత కుమార్‌ మండిపడ్డారు. బంద్‌ కారణంగా అత్యవసర సేవలకు, అయ్యప్ప భక్తులు వెళ్లే వాహనాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన వెల్లడించారు. శబరిమల ఆలయం కట్టుదిట్టమైన భద్రత మధ్య నిన్న తెరుచుకున్న సంగతి తెలిసిందే. 

50ఏళ్లలోపు మహిళలు ఆలయంలోకి ప్రవేశించకుండా అయ్యప్ప భక్తులు ఆందోళనలు చేస్తున్నారు. మండలం పూజ కోసం ఆలయం 41 రోజుల పాటు తెరిచి ఉంటుంది. ఆలయం వద్ద పోలీసుల భద్రత చాలా ఎక్కువగా ఉందని, కర్ఫ్యూ విధించారని, అయ్యప్ప పూజలు కూడా చేసుకోనివ్వట్లేదని ఓ భాజపా నేత ఆరోపించారు.