Asianet News TeluguAsianet News Telugu

కేరళలో ఏపీ అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా.. బాలుడి పరిస్థితి విషయం, పలువురికి గాయాలు.. ప్రమాదంపై సీఎం జగన్ ఆరా..

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న బస్సు కేరళలో శనివారం ప్రమాదానికి గురైంది. పతనంతిట్ట జిల్లాలో లాహా సమీపంలో బస్సు బోల్తాపడింది. 

Sabarimala devotees from Andhra Pradesh injured after bus overturns in Kerala
Author
First Published Nov 19, 2022, 12:28 PM IST

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న బస్సు కేరళలో శనివారం ప్రమాదానికి గురైంది. పతనంతిట్ట జిల్లాలో లాహా సమీపంలో బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో  20 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 44 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులోని యాత్రికులను రక్షించి సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు జిల్లా అధికారులు తెలిపారు. బస్సు కింద చిక్కుకున్న ముగ్గురు ప్రయాణికులను రక్షించేందుకు గంటల సమయం పట్టినట్టుగా సమాచారం.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎనిమిదేళ్ల బాలుడితో సహా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో కొట్టాయం మెడికల్ కాలేజీకి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో గాయపడిన మరో 18 మందిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. మిగిలిన వారిని సమీపంలోని పెరినాడులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు.

ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది, మోటారు వాహనాల శాఖ అధికారులు, స్థానికులు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఉన్నతాధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ యాత్రికులకు సహాయక చర్యలు, తదుపరి చికిత్స కోసం ఏర్పాట్లు చేశారు. అనంతరం వీణా జార్జ్ మాట్లాడుతూ.. గాయపడిన వారందరికీ అవసరమైన చికిత్స అందజేశామన్నారు.

ఇక, ప్రమాదంలో గాయపడినవారిని ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు మండలం మాదేపల్లి ప్రాంతానికి చెందిన అయ్యప్ప భక్తులుగా గుర్తించారు. వీరు శబరిమల దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఇక్కడి జిల్లా అధికారు.. కేరళలోని పతనంతిట్ట జిల్లా అధికారులతో మాట్లాడారు. 

మరోవైపు ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విచారం చేశారు. బస్సు ప్రమాద ఘటనపై ఆరా తీశారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా కేరళ అధికారులతో టచ్‌లో ఉండాలని సూచించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios