ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో వీకెండ్ కర్ఫ్యూను అధికారులు ఎత్తివేశారని భారత ఎంబసీ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేసిన నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులకు ఎంబసీ అధికారులు కీలక సూచనలు చేశారు.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో వీకెండ్ కర్ఫ్యూను అధికారులు ఎత్తివేశారని భారత ఎంబసీ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేసిన నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులకు ఎంబసీ అధికారులు కీలక సూచనలు చేశారు. విద్యార్థులందరూ పశ్చిమ ప్రాంతాలకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌లకు వెళ్లాలని సూచించింది. ప్రజలను తరలించడం కోసం ఉక్రెయిన్ రైల్వేలు ప్రత్యేక రైళ్లను అందుబాటులో ఉంచాయని తెలిపింది. ఈ మేరకు ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీకి ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
ఇక, ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియను భారత ప్రభుత్వం వేగవంతం చేసింది. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు చేరుకుంటున్న విద్యార్థులను ప్రత్యేక విమానాల ద్వారా ఇండియాకు తరలిస్తుంది. ఇప్పటికే రొమేనియా, హంగేరిల సరిహద్దులకు చేరుకన్న భారతీయులను స్వదేశానికి తరలిస్తున్నారు. ఇప్పటికే ఐదు విమానాలు భారత్‌కు చేరుకున్నాయి. ఇంకా 16 వేలకు పైగా భారతీయులు ఉక్రెయిన్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఈ క్రమంలోనే మరింత వేగంగా భారతీయుల తరలింపు ప్రక్రియను చేపట్టాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. పోలాండ్, స్లోవేకియాల సరిహద్దులకు చేరుకుంటున్న భారతీయులను కూడా స్వదేశానికి తరలించేలా భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఉక్రెయిన్‌లో భారతీయుల తరలింపుకు సంబంధించి ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపులో ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రధానంగా చర్చించారు.
ఈ క్రమంలోనే నలుగురు కేంద్ర మంత్రులను ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరెన్ రిజిజు, జనరల్ (రిటైర్డ్) వికె సింగ్ ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారతీయుల తరలింపు ప్రక్రియను సమన్వయం చేయడానికి, విద్యార్థులకు సహాయం చేయడానికి ఆయా దేశాలకు వెళ్లనున్నట్టుగా పేర్కొన్నాయి. మంత్రులతో పాటు పలువురు అధికారులు కూడా ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లనున్నారు.
రొమేనియా, Moldovaల నుంచి తరలింపును జ్యోతిరాదిత్య సింధియా పర్యవేక్షించనున్నారు. కిరణ్ రిజిజు.. స్లోవేకియాకు, హర్దీప్ సింగ్ పూరి.. హంగేరికు, వీకే సింగ్.. పోలాండ్ వెళ్లి భారతీయుల తరలింపును ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించనున్నారు.
