ఉక్రెయిన్ గగనతల ఆంక్షలు విధించిన తరువాత అక్కడ చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ నిర్వహిస్తోంది. అందులో భాగంగానే ప్రత్యేక విమనాలు నడుపుతోంది. మొదటి విమానం 219 మంది ప్రయాణికులను తీసుకొని శనివారం రాత్రి ముంబైలో ల్యాండ్ అయ్యింది. ఇక రెండో విమానం ఆదివారం తెల్లవారుజామున 2.45 గంటల ప్రాంతంలో ఢిల్లీ దిగింది. అందులో వచ్చిన ప్రయాణికులకు కేంద్ర విమానయాన మంత్రి జోత్యిరాదిత్య సింథియా స్వాగతం పలికారు.
ఉక్రెయిన్ (Ukraine) లో చిక్కుకున్న భారతీయులను మన దేశానికి తీసుకొచేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. వారిని క్షేమంగా తీసుకురావడమే తమ మొదటి కర్తవ్యమని చెబుతోంది. దానికి అనుగుణంగా వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఉక్రెయిన్ గగనతలం మూసి వేసిన తరువాత అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతూ రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి విమనాలు నడపాలని నిర్ణయించింది. అందులో భాగంగానే శుక్రవారం మొదటి విమానం అక్కడికి బయలుదేరి వెళ్లింది. శనివారం రాత్రి అది ముంబై (mumbai)కి చేరుకుంది.
తాజాగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 250 మంది భారతీయలను తీసుకొని రెండో విమానం ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీ (delhi) విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. ఈ మేరకు ప్రభుత్వ అధికారులు వివరాలు వెల్లడించారు. ఉక్రెయిన్ నుంచి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని వచ్చిన విద్యార్థులకు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (yotiraditya Scindia) విమానాశ్రయంలో గులాబీలను అందజేసి స్వాగతం పలికారు.
ఉక్రెయిన్ (Ukraine), రష్యా (Russia) మధ్య భీకరంగా దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ వివిధ దేశాల పౌరులు చిక్కుకున్నారు. అందులో మన దేశ పౌరులు కూడా ఉన్నారు. ఎయిర్ ఇండియా ఈ నెల 22వ తేదీన ఉక్రెయిన్ కు మొదటి సర్వీసును నడిపింది. ఆ సమయంలో ఉక్రెయిన్ రాజధాని కైవ్ లో ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ రెండో విమాన ఇక్కడి నుంచి బయలుదేరిన సమయంలో గగనతలంపై ఉక్రెయిన్ ఆంక్షలు విధించింది. దీంతో అక్కడికి బయలుదేరిన విమానం మధ్యలోనే ఇండియాకు తిరిగి వచ్చింది. అయితే అక్కడ ఉన్న భారతీయ విద్యార్థులకు ఇండియన్ ఎంబీసీ రక్షణ కల్పించింది. కైవ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆశ్రయం కల్పించింది.
ఉక్రెయిన్ నుంచి ఇండియాకు రాలేక, ఇండియన్ ఎంబసీ (indian embassy) అధికారుల ఆధ్వర్యంలో ఉన్న భారతీయులను తీసుకొచ్చేందుకు భారతదేశం శనివారం నుంచి ప్రక్రియ మొదలు పెట్టింది. అందులో భాగంగానే మొదటి AI1944 విమానం శుక్రవారం బయలుదేరి వెళ్లి 219 ప్రయాణికులతో శనివారం సాయంత్రం బుకారెస్ట్ నుండి ముంబైకి వచ్చింది. రెండో AI1942 విమానం 250 మంది భారతీయ పౌరులతో తీసుకొని ఆదివారం తెల్లవారుజామున 2.45 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. కాగా హంగేరియన్ రాజధాని బుడాపెస్ట్ నుంచి బయలుదేరే ఎయిర్ ఇండియా (air india) కు చెందిన మూడో విమానం AI1940 కూడా ఆదివారం ఢిల్లీకి రానుందని అధికారులు వెల్లడించారు.
రష్యా సైనిక దాడి ప్రారంభమైన ఫిబ్రవరి 24 ఉదయం నుండి ఉక్రేనియన్ గగనతలం పౌర విమానాల కార్యకలాపాలను ఉక్రెయిన్ నిలిపివేసింది. అందువల్ల భారతీయ తరలింపు విమానాలు బుకారెస్ట్, బుడాపెస్ట్ నుండి నడుస్తున్నాయి. ఉక్రెయిన్-రొమేనియా సరిహద్దు, ఉక్రెయిన్-హంగేరీ సరిహద్దులకు చేరుకున్న భారతీయ పౌరులను భారత ప్రభుత్వ అధికారుల సహాయంతో రోడ్డు మార్గంలో వరుసగా బుకారెస్ట్, బుడాపెస్ట్‌లకు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి వారిని ఎయిర్ ఇండియా విమానాలలో భారత్ కు తీసుకువచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇలా తీసుకొస్తున్న పౌరుల నుండి ప్రభుత్వం ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని అధికారులు చెప్పారు.
కాగా.. ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన స్టూడెంట్లకు స్వాగతం పలికుతున్న జ్యోతిరాదిత్య సింధియా ఫొటోలను ఎయిర్ ఇండియా ట్విట్లర్ లో షేర్ చేసింది. ‘‘ ఫిబ్రవరి 27వ తేదీ తెల్లవారుజామున AI 1942 ద్వారా బుకారెస్ట్ నుండి ఢిల్లీకి తిరిగి వచ్చిన భారతీయ పౌరులను విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రిసీవ్ చేసుకుంటున్నారు. యుద్ధం వల్ల ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించడానికి ఆపరేషన్ చేసారు ’’ అని ఎయిర్ లైన్ పేర్కొంది.
