ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల భద్రత, తరలింపునకు తొలి ప్రధాన్యత ఇస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఆదివారం రాత్రి ప్రధాని అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సుమారు రెండు గంటల పాటు కొనసాగింది. 

ఉక్రెయిన్ (Ukraine), రష్యా (Russia) మ‌ధ్య వివాదం ఇంకా ముగియ‌లేదు. నాలుగో రోజు కూడా ఉక్రెయిన్, ర‌ష్యాకు మ‌ధ్య భీక‌ర పోరు కొనసాగింది. ఈ నేప‌థ్యంలో అక్క‌డ చిక్కుకున్న భార‌తీయుల ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. వారిని తీసుకొచ్చేందుకు భార‌త ప్ర‌భుత్వం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఇప్ప‌టికే మూడు నాలుగు విమాన‌ల ద్వారా ఇండియ‌న్లు ఇక్క‌డికి తిరిగి వ‌చ్చారు. మిగిలిన వారిని కూడా తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. 

భార‌త జాతీయుల తరలింపు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (narendra modi) ఉక్రెయిన్ సంక్షోభంపై ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ మేర‌కు అధికార వ‌ర్గాలు వివ‌రాలు వెల్ల‌డించాయి. ఈ స‌మావేశంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (jai shankar) కూడా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ (uttar pradesh)నుండి తిరిగి వచ్చిన వెంటనే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఈ ఉన్న‌త స్థాయి స‌మావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మాట్లాడుతూ.. విద్యార్థుల భద్రతకు భరోసా కల్పించడం, వారిని ఖాళీ చేయించడం త‌మ‌ ప్రధాన కర్తవ్యమని అన్నారు. ఉక్రెయిన్‌కు పొరుగున ఉన్న దేశాల తరలింపును వేగవంతం చేసేందుకు సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంపై ఆయ‌న చ‌ర్చ‌లు జ‌రిపారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ప్రధానమంత్రి సమావేశం 2 గంటలకు పైగా కొనసాగింది. 

ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడంతో పెద్ద సంఖ్యలో భారతీయులు, ఎక్కువగా విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారు. శ‌నివారం నుంచి కేంద్ర ప్ర‌భుత్వం వారిని ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయ‌త్నిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 900పైగా ప్ర‌జ‌ల‌ను మ‌న దేశానికి తీసుకువ‌చ్చారు. ఈ విష‌యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రేనియన్ అధ్య‌క్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో కూడా ప్ర‌ధాని మాట్లాడారు. చర్చ‌ల ద్వారా సంక్షోభాన్ని త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నించాల‌ని గ‌తంలోనే భార‌త్ పిలుపునిచ్చింది. 

ఇదిలా ఉండ‌గా.. ఆదివారం మరో 688 మంది పౌరులను భార‌త్ ఉక్రెయిన్ నుంచి మూడు ఎయిర్ ఇండియా (air india) విమానాలలో తీసుకొచ్చింది. సుమారు 13,000 మంది భారతీయులు ప్రస్తుతం ఉక్రెయిన్‌లో ఉన్నారని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా (jyotiraditya scindia) తెలిపారు. ఆయ‌న ఆదివారం తెల్ల‌వారుజామున ఉక్రెయిన్ నుంచి ఢిల్లీ విమానాశ్ర‌యానికి వ‌చ్చిన విద్యార్థుల‌కు స్వాగతం ప‌లికారు. ఈ విష‌యంలో విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా మీడియాతో మాట్లాడుతూ.. రొమేనియా, హంగేరి నుండి ఇప్పటికే వెయ్యి మంది భారతీయులు త‌ర‌లివెళ్లార‌ని, మరో 1,000 మందిని ఉక్రెయిన్ నుండి భూ మార్గాల ద్వారా తరలించినట్లు సమావేశంలో తెలిపారు.

ఉక్రెయిన్ నుంచి ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకొని ఆదివారం ఢిల్లీకి తిరిగి వ‌చ్చిన స్టూడెంట్లు క‌న్నీళ్ల ప‌ర్యంత‌మైన దృశ్యాలు క‌నిపించాయి. అక్క‌డి నుంచి సుర‌క్షితంగా ఇండియాకు తీసుకొచ్చిన ప్ర‌భుత్వానికి వారు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇంకా ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను తిరిగి తీసుకురావడానికి ఢిల్లీ నుండి సోమ, మంగళవారాల్లో ఇస్తాంబుల్ మీదుగా బుడాపెస్ట్‌కు రెండు విమానాలను నడుపుతామని ఇండిగో తెలిపింది. ఆప‌రేష‌న్ గంగా కింద 219 మంది వ్యక్తులతో బుకారెస్ట్ నుంచి బ‌య‌లుదేరిన మొద‌టి తరలింపు విమానం శ‌నివారం రాత్రి ముంబైలో ల్యాండ్ అయింది. అందులో తిరిగి వ‌చ్చిన చాలా మంది వారి సొంత రాష్ట్రాలకు చేరుకున్నారు. రష్యా సైనిక దాడి ప్రారంభమైన ఫిబ్రవరి 24 ఉదయం నుండి ఉక్రేనియన్ గగనతలంపై పౌర విమానాల రాక‌పోక‌లపై ఆంక్ష‌లు విధించింది. దీంతో భారతీయ తరలింపు విమానాలు బుకారెస్ట్, బుడాపెస్ట్ నుండి నడుస్తున్నాయి.