కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కేంద్రప్రభుత్వం విధి విధానాలను ప్రకటించింది. దీని ప్రకారం ఐదెకరాలలోపు ఉన్న సన్న, చిన్నకారు రైతులకు నెలకు రూ.6 వేలు సాయం అందించనున్నారు.

ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, పనిచేస్తున్న లేదా రిటైరైన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రస్తుత లేదా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మునిసిపల్ మేయర్లు, జిల్లా పంచాయతీ అధ్యక్షులు ఈ పథకానికి అర్హులు కాదు.

అలాగే గతేడాది ఆదాయపు పన్ను చెల్లించిన వారిని కూడా కేంద్రం అనర్హులుగా ప్రకటించింది. ఐదెకరాల్లోపు భూమి ఉన్నా కూడా...కుటుంబంలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వృత్తి నిపుణులు ఉన్నా అర్హులు కారని తెలిపింది.

ఈ పథకానికి కాను కేంద్రం రూ.75 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తాత్కాలిక ఆర్ధిక మంత్రి పీయూష్ గోయెల్ పార్లమెంటులో ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 31వ తేదీ లోపు మొదటి విడతగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. రెండో విడతకు మాత్రం ఆధార్ కార్డ్‌ను జత చేయాల్సి ఉంటుంది.