మహారాష్ట్రలోని ముంబైలో జరిగిన యూత్ కాంగ్రెస్ సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోవడంతో హింసాత్మక దృశ్యాలు దర్శనమిచ్చాయి. 

మహారాష్ట్రలోని ముంబైలో జరిగిన యూత్ కాంగ్రెస్ సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోవడంతో హింసాత్మక దృశ్యాలు దర్శనమిచ్చాయి. మహారాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ కునాల్‌ నితిన్‌ రౌత్‌ను తొలగించే విషయంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఈ ఘర్షణ జరిగినట్లు సమాచారం. కాసేపటికే ఈ ఘర్షణ కాస్త శృతిమించింది. ఫలితంగా రెండు గ్రూపులు కుర్చీలు విసురుకున్నారు. అక్కడ కొందరు భౌతిక దాడులకు కూడా దిగినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

ఈ సమావేశాన్ని దాదర్‌ తిలక్‌ భవన్‌లోని కాంగ్రెస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశం అనంతరం యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడాలని భావించారు. అయితే సమావేశంలో రసాభాస చోటుచేసుకోవడంతో ఆయన మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

ఇక, యూత్ కాంగ్రెస్ సమావేశంలో చోటుచేసుకున్న ఘర్షణకు సంబంధించిన వీడియోను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావల్ల ట్విట్టర్‌లో షేర్ చేశారు. కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు. ముంబైలో జరిగిన యూత్ కాంగ్రెస్ సభ కుర్చీలు విసురుకోవడంతో హింసాత్మకంగా ముగిసిందని ఎద్దేవా చేశారు. ఐఎన్‌సీ(ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) అంటే.. నాకు కుర్చీ కావాలి (ఐ నీడ్ చైర్) లేదా నేను కుర్చీ వేయాలి (ఐ నీడ్ టూ త్రో చైర్) అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. కాంగ్రెస్‌లో ఎప్పుడూ ఇలాంటి ఘటనలే చోటుచేసుకుంటాయని అన్నారు. రాజస్థాన్, ఛత్సీగఢ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలలో జరిగాయని.. ఇప్పుడు మహారాష్ట్ర కూడా ఆ జాబితాలో చేరిందని అన్నారు. 

Scroll to load tweet…

భారత్ జోడో గురించి మాట్లాడే వారు ముందుగా పార్టీ జోడో చేయాలి కాంగ్రెస్ నాయకులను ఎద్దేవా చేశారు. యూత్ కాంగ్రెస్ చీఫ్ శ్రీవినాస్ (పోలీసుల నుంచి పారిపోవడంలో నిపుణుడు) కూడా అక్కడి నుంచి త్వరగా వెళ్లిపోవాల్సి వచ్చిందని ట్వీట్‌లో పేర్కొన్నారు.