విశ్వాసంలోనే కాదు డ్యూటీలోనే ఫస్ట్ అని నిరూపించింది ఆ శునకం. కాప్ ఆఫ్ ది మంత్ అవార్డును తీసుకుని తన సత్తా ఏంటో నిరూపించింది. వివరాల్లోకి వెడితే.. చత్తీస్‌గఢ్‌లో విధి నిర్వహణలో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన పోలీసులను ప్రతి నెలా ‘కాప్ ఆఫ్ ది మంత్’ అవార్డుతో సత్కరిస్తారు. 

ఈ అవార్డు తీసుకున్నవారి ఫొటోలను రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లలో డిస్ ప్లే చేసి మిగతా పోలీసులకు స్పూర్తి కలిగేలా చేస్తారు. వీరికి అవార్డుతో పాటు కొంత నగదు బహుమతి కూడా ఉంటుంది. అలా ఈ సారి ఈ అవార్డును ఓ పోలీసు జాగిలం కూడా గెలుచుకుంది. దీని పేరు రూబీ. తన పోలీసు కెరీర్‌లో రూబీ చాలా కేసులు ఛేదించిందట. 

పోలీస్ కుక్కలు వాసన పసిగట్టి కేసును ఛేదించడంలో తోడ్పడడం మామూలే కదా.. ఇందులో రూబీ ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్.. అదే రూబీకి ఈ అవార్డు తెచ్చిపెట్టింది. అదేంటంటే.. రూబీ పరిష్కరించిన కేసుల్లో ప్రఖ్యాత సారన్‌ఘర్ కోట చోరీ కేసు కూడా ఉంది. 

ఈ కేసు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ప్యాలెస్‌లో చాలా ఖరీదైన రెండు వెండి పళ్లేలు చోరీ అయ్యాయి. వీటి ధర కనీసం 6 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. ఇంతటి ఖరీదైన ట్రేలు దొంగతనం జరిగినా పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరకలేదు. అదిగో సరిగ్గా అప్పుడే రూబీ రంగంలోకి దిగింది. తన ట్రైనర్ వీరేందర్‌తో కలిసి ఘటనా స్థలాన్ని మొత్తం వెదికింది. పోలీసులకు చాలా ముఖ్యమైన క్లూస్ అందించింది. 

రూబీ సేవలను గుర్తించిన పోలీసు విభాగం దాన్ని ‘కాప్ ఆఫ్ ది మంత్’ అవార్డుతో సత్కరించింది. రూబీతో పాటు వీరేందర్‌కు కూడా ఈ అవార్డు లభించింది. మొత్తమ్మీద ముగ్గురికి ఈ అవార్డు ప్రదానం చేశారు. వీరితో పాటు ఓ లీగల్ సెక్షన్ పోలీసు అధికారి కూడా ‘కాప్ ఆఫ్ ది మంత్’ అవార్డు అందుకున్నాడు. ఈ విషయాన్ని రాయ్‌ఘర్ జిల్లా ఎస్పీ సంతోష్ సింగ్ వెల్లడించారు. అలాగే తమ జిల్లాలో ఇలా ఓ జాగిలానికి ఈ అవార్డు రావడం ఇదే తొలిసారని ఆయన చెప్పారు. 

సాధారణంగా మందు గుండు సామగ్రి, మత్తు పదార్థాలు, డబ్బు, రక్తం, దొంగతనంగా తీసుకొస్తున్న ఎలక్ట్రానిక్ వస్తువులు పసిగట్టేందుకు ట్రెయినింగ్ ఇస్తారు. ఈ ట్రెయినింగ్‌తోనే చాలా కేసులు సాల్వ్ చేయడంలో పోలీసులకు రూబీ సాయం చేసింది. ఇప్పుడు ఈ అరుదైన గుర్తింపు పొందింది.