జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ సోదరి రుబయా సోదరీ తనను కిడ్నాప్ చేసినవారిని గుర్తు పట్టింది. ఢిల్లీలో టాడా కోర్టులో నిందితుల ఫొటోలు చూపించగా.. తనను కిడ్నాప్ చేసిన వారిలో యాసిన్ మాలిక్ ఉన్నారని, ఆయనతోపాటు మరో ముగ్గురు ఉన్నట్టు ఆమె గుర్తించింది. 

న్యూఢిల్లీ: మూడు దశాబ్దాల తర్వాత ఓ హై ప్రొఫైల్ కిడ్నాప్ కేసులో కీలక పురోగతి వచ్చింది. జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కూతురు, మెహబూబా ముఫ్తీ సోదరి రుబయా సయీద్ కిడ్నాప్ కేసులో ముందడుగు పడింది. 56 ఏళ్ల రుబయా సయీద్ తనను కిడ్నాప్ చేసిన వారిని కోర్టులో గుర్తించింది. యాసిన్ మాలిక్‌తోపాటు మరో ముగ్గురు తనను కిడ్నాప్ చేశారని, వారిని గుర్తు పట్టింది. టాడా కోర్టులో ఆమె తన కిడ్నాపర్లను గుర్తించింది. తదుపరి విచారణను ఆగస్టు 23వ తేదీకి వాయిదా వేసింది.

1989 డిసెంబర్‌లో రుబయా సయీద్‌ను యాసిన్ మాలిక్ సహా మరికొందరు కలిసి కిడ్నాప్ చేశారు. ఆ సమయంలో రుబయా సయీద్ తండ్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ వీపీ సింగ్ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.

ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్న రుబయా సయీద్‌కు టాడా కోర్టు సమన్లు పంపింది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశించింది. 

ఈ కేసు గురించి టాడా కోర్టు అడ్వకేట్ మోనికా కోహ్లీ మాట్లాడుతూ, యాసిన్ మాలిక్, మరో ముగ్గురిని రుబయా సయీద్ గుర్తు పట్టడం ఈ కిడ్నాప్ కేసు కీలక మలుపు తిరగడానికి ఉపకరించిందని వివరించారు. ఇది చాలా పెద్ద విజయంగా తాము భావిస్తున్నట్టు తెలిపారు. సీబీఐ ముందు ఆమె ఇచ్చిన వాంగ్మూలానికి ఇప్పటికి ఆమె కట్టుబడి ఉన్నారని చెప్పారు. ఆమె ప్రతి ఒక్కరినీ గుర్తు పట్టిందని అన్నారు.

కోర్టులో ఆమెకు నిందితుల ఫొటోలు చూపించామని, ఆమె వారిని గుర్తు పట్టిందని తెలిపారు. యాసిన్, ఇతర నిందితులను ఈ కిడ్నాప్ కేసులో విచారించడానికి ముందడుగు పడిందని వివరించారు.

ఈ కిడ్నాప్ కేసులో ప్రత్యక్షంగా హాజరు కావాలని మే 27వ తేదీన టాడా కోర్టు రుబయా సయీద్‌కు సమన్లు పంపింది. ఈ కేసు దర్యాప్తును 1990లో తమ అధీనంలోకి తీసుకున్న సీబీఐ రుబయా సయీద్‌ను విట్నెస్‌గా పేర్కొంది.

1989 డిసెంబర్ 8వ తేదీన రుబయా సయీద్‌ను కిడ్నాప్ చేశారు. డిసెంబర్ 13న విడుదల చేశారు. ఆమెను కిడ్నాప్ చేసి వారు.. అరెస్టయి జైలులో ఉంటున్న ఐదుగురు మిలిటెంట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారి డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. ఈ ఐదుగురు మిలిటెంట్లను విడుదల చేశారు.