డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు గాను గత కొన్నిరోజులుగా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) చర్యలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది.

ఆదివారం అర్ధరాత్రి నుంచి 24 గంటలు ఆర్టీజీఎస్‌ (రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌) సేవలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ రోజు అర్ధరాత్రి 12.30 నిమిషాల నుంచి ఆర్టీజీఎస్‌ సేవలు 24x7 అందుబాటులో ఉంటాయని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు. 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆర్‌టీజీఎస్‌ సేవలు అన్ని పనిదినాల్లో కేవలం ఉదయం 7 గం.ల నుంచి సాయంత్రం 6గం.ల వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తాజా నిర్ణయంతో 24 గంటల పాటు ఎప్పుడైనా లావాదేవీలు జరుపుకోవచ్చు.

అధిక మొత్తంలో నగదు బదిలీ చేసేందుకు వినియోగదారులు ఆర్‌టీజీఎస్‌ను వినియోగిస్తున్నారు. నెఫ్ట్‌ ద్వారా కేవలం రూ.2 లక్షలలోపు మాత్రమే నగదు బదిలీ చేసుకునే అవకాశం ఉంది.

గతేడాది డిసెంబర్‌ నుంచి నెఫ్ట్‌ (నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌) విధానంలో అన్ని రోజుల్లో లావాదేవీలు జరుపుకునే సదుపాయాన్ని ఆర్‌బీఐ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.