కాంగ్రెస్ విధానాలను నిత్యం వ్యతిరేకించే బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్ నిర్ణయాలు ఇటీవలి కాలంలో రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. కొద్దిరోజుల క్రితం నాగ్‌పూర్‌లో జరిగిన ఆరెస్సెస్ కార్యక్రమానికి కాంగ్రెస్ కురువృద్ధుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించడం దేశరాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీసింది

కాంగ్రెస్ విధానాలను నిత్యం వ్యతిరేకించే బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్ నిర్ణయాలు ఇటీవలి కాలంలో రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. కొద్దిరోజుల క్రితం నాగ్‌పూర్‌లో జరిగిన ఆరెస్సెస్ కార్యక్రమానికి కాంగ్రెస్ కురువృద్ధుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించడం దేశరాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.

తాజాగా మరోసారి కాంగ్రెస్‌నే ఆరెస్సెస్ టార్గెట్ చేసింది. ఏకంగా ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి ఆహ్వానం పంపనుంది. సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు ఢిల్లీలో జరగనున్న కార్యక్రమానికి రాహుల్‌ను ఆహ్వానించాలని ఆరెస్సెస్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా సీపీఎంకు చెందిన సీతారాం ఏచూరీతో పాటు మరికొందరు జాతీయ నేతలను కూడా ఆహ్వానించాలని ఆరెస్సెస్ అధినాయకత్వం భావిస్తోందట.

ఫ్యూచర్ ఆఫ్ ఇండియా పేరుతో జరిగే ఈ కార్యక్రమానికి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ నాయకత్వం వహిస్తారు. అయితే ఆరెస్సెస్ విధానాలను రాహుల్ గాంధీ తొలి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక... ఆయన ఆరెస్సెస్‌పై విమర్శల దాడిని పెంచారు. యూరప్‌ పర్యటనలో భాగంగా ఆరెస్సెస్‌ను అరబ్ దేశాల్లోని రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్ ముస్లిం బ్రదర్‌హుడ్‌తో పోల్చడం అప్పట్లో పెను దుమారాన్ని రేపింది.