RSS chief Mohan Bhagwat: వార‌ణాసిలోని జ్ఞాన‌వాపి  అంశంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ నాగ‌పూర్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ప్ర‌స్తావించారు. జ్ఞాన‌వాపి అంశం ఎప్ప‌టి నుంచో ఉంద‌ని, చ‌రిత్ర‌ను మ‌నం మార్చ‌లేమ‌ని, నేటి త‌రానికి చెందిన హిందువులు కానీ ముస్లింలు కానీ ఆ వివాదాన్ని సృష్టించ‌లేద‌ని అన్నారు.హిందువులు, ముస్లింలు అన్ని వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన కోరారు 

RSS chief Mohan Bhagwat: ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న‌ జ్ఞాన్‌వాపి మ‌సీదులో జరిగిన‌ వీడియోగ్రఫీ సర్వేపై వివాదం కొనసాగుతున్నది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ ఈ అంశంపై ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. నాగ్‌పూర్‌లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ మాట్లాడుతూ.. జ్ణానవాపి మసీదు విషయంలో చరిత్రను మార్చలేమని, హిందూ- ముస్లీంలు పరస్పర అంగీకారం ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకుందామని ఆయన పిలుపు నిచ్చారు. 

ఆ మార్గంలో ప‌రిష్కారం దొర‌క‌ని ప‌క్షంలో ప్ర‌జ‌లు కోర్టును ఆశ్ర‌యిస్తార‌ని, కోర్టు ఎటువంటి తీర్పు ఇచ్చినా దాన్ని స్వాగతించాల‌ని భ‌గ‌వ‌త్ తెలిపారు. న్యాయవ్యవస్థ పవిత్రమైందనీ, కోర్టు నిర్ణ‌యాల‌కు క‌ట్టుబ‌డి ఉండాల‌ని, కోర్టు నిర్ణ‌యాల‌ను ప్ర‌శ్నించ‌రాదనీ ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నారు.

జ్ఞానవాపి విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ వివాదం ఎప్ప‌టి నుంచో కొనసాగుతోందని అన్నారు. చరిత్రను మ‌నం మార్చలేమ‌నీ, ఈనాటి హిందువులు గానీ, ముస్లింలు గానీ ఈ వివాదాన్ని సృష్టించలేదనీ. ఆ ఘ‌ట‌న ఆ రోజుల్లోనే జరిగిందనీ,. ఇస్లాం మ‌తం.. ఇత‌ర దేశీయుల దండ‌యాత్ర వ‌ల్ల భార‌త్ లోకి వ‌చ్చింద‌నీ, ఆ స‌మయంలో అనేక హిందూ దేశాలు నాశ‌న‌మ‌య్యాయని, భారతదేశానికి స్వాతంత్య్రం కావాలని కోరుకునే వారి మనోధైర్యాన్ని దెబ్బ‌తీయాల‌నే ఉద్దేశంతో.. దేవస్థానాలు (మత స్థలాలు) కూల్చివేశార‌ని మోహ‌న్ భ‌గ‌వ‌త్ అన్నారు.

జ్ఞానవాపీ అంటే.. హిందూవుల‌కు ప్రత్యేకమైన భక్తి శ్రద్ధలు ఉన్నాయనీ, ఇది తరతరాల నుంచి వస్తోందనీ, కానీ ప్రతి మసీదులో శివలింగాన్ని ఎందుకు వెతకాలని భగవత్ అన్నారు. బయటి నుంచి వచ్చిన మతమైనా అది కూడా ఒక పూజా విధానమే. ఆ భక్తి మార్గాన్ని ఎంచుకున్న వారు ముస్లింలు అయ్యారు. అంతేకానీ వారేమీ బయటి వారు కాదు. ఈ విషయాన్ని ముస్లింలు కూడా అర్థం చేసుకోవాలనీ, హిందువులకు ప్రత్యేక భక్తి ఉన్న ప్రదేశాలపై ఎందుకు వివాదాన్నిపెంచాలని అన్నారు. ఇప్పుడు తమకు దేవాలయాల కోసం ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం లేదని.. భవిష్యత్తులోనూ హిందూ దేవాలయాల ఉద్యమాల్లో ఆర్‌ఎస్‌ఎస్ పాల్గొనదని మోహన్ భగవత్ చెప్పారు. 

హిందూవులకు ఇత‌రుల‌ పూజ విధానం పట్ల వ్యతిరేకత లేదని, హిందువులు వాటన్నింటినీ అంగీకరిస్తార‌నీ, అన్ని ర‌కాల మ‌తారాధన‌లు పవిత్ర‌మైన‌వ‌న్నారు. కొంద‌రు కొన్ని ర‌కాల ఆరాధ‌న‌ల‌ను ద‌త్త‌త తీసుకున్నార‌ని, కానీ అవ‌న్నీ మ‌న రుషులు, మునులు, క్ష‌త్రియుల నుంచి వ‌చ్చిన‌వే అన్నారు. మ‌న పూర్వీకులంతా ఒక్క‌టే అన్నారు. కొన్ని ప్ర‌దేశాల ప‌ట్ల ప్ర‌త్యేక భ‌క్తి ఉంద‌ని, వాటి గురించి మాట్లాడామ‌ని, కానీ ప్ర‌తి రోజు కొత్త విష‌యాన్ని బ‌య‌ట‌కు తీసుకురావ‌ద్ద‌న్నారు. 

భగవత్ ఇంకా మాట్లాడుతూ.. హిందువులు ప్ర‌త్యేకంగా పూజించే అనేక ప్ర‌దేశాల్లో వివాదాలను సృష్టించార‌ని, హిందువులు... ముస్లింలకు వ్యతిరేకంగా ఎప్పుడూ ఆలోచించరనీ, నేటి ముస్లింల పూర్వీకులు కూడా ఆనాటి హిందువుల‌నీ.. మాన‌సిక ధైర్యాన్ని దెబ్బ‌తీసేందుకు వాళ్ల‌ను ఆరోజుల్లో దూరంగా ఉంచార‌ని, అందుకే హిందువులు త‌మ మ‌త‌ప‌ర‌మైన ప్ర‌దేశాల ర‌క్ష‌ణ కోరుతున్న‌ట్లు భ‌గ‌వ‌త్ వెల్ల‌డించారు. 

రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భారతదేశం అనుసరిస్తున్న సమతుల్య విధానాన్ని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ ప్రశంసించారు. భారతదేశం నిజం మాట్లాడుతోంది.. కానీ, సమతుల్య విధానాన్ని అనుసరించాలి. అదృష్టవశాత్తూ.. ఇది సమతుల్య విధానాన్ని తీసుకుంది. ఇది దాడికి మద్దతు ఇవ్వలేదు లేదా రష్యాను వ్యతిరేకించలేదు. ఉక్రెయిన్‌కు యుద్ధంలో సహాయం చేయలేదు.. కానీ వారికి అన్ని ఇతర సహాయాన్ని అందిస్తోంది. చర్చలు జరపాలని రష్యాను నిరంతరం అడుగుతోంది'' అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ అన్నారు.