సారాంశం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)  అత్యున్నత నిర్ణాయక విభాగం, అఖిల భారతీయ ప్రతినిధి సభ బెంగళూరులో జరగనుంది. ఇందులో శతాబ్ది సంవత్సర ప్రణాళికలతో సహా ముఖ్యమైన విషయాలపై చర్చించనున్నారు. ఇంతకీ ఏ తేదీల్లో ఈ సభ జరగనుంది.? ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారతీయ ప్రతినిధి సభను బెంగళూరులో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మార్చి 21, 22, 23 తేదీల్లో ఈ సభ జరగనుంది. ఈ సభను ప్రతీ ఏటా నిర్వహిస్తుంటారు. గతేడాది నాగ్‌పూర్‌లో నిర్వహించగా ఈ ఏడాది ఈ వేడుకలకు బెంగళూరు వేదిక కానుంది. ఈ సమావేశం బెంగళూరులోని చెన్నేనహళ్లిలో ఉన్న జనసేవా విద్యా కేంద్ర ప్రాంగణంలో జరుగుతుంది.

సమావేశంలో 2024-25 సంవత్సరపు కార్యకలాపాల నివేదికను ప్రతిపాదిస్తారు. ఈ నివేదికపై సమీక్షాత్మక చర్చతో పాటు ప్రత్యేక కార్యక్రమాల గురించి కూడా వివరిస్తారు. రాబోయే విజయదశమి (దసరా) 2025 నాటికి సంఘ్ కార్యకలాపాలు ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. దీని కారణంగా 2025 నుంచి 2026 వరకు సంఘ్ శతాబ్ది సంవత్సరంగా పరిగణిస్తారు. సమావేశంలో శతాబ్ది సంవత్సరపు కార్య విస్తరణ సమీక్షతో పాటు రాబోయే శతాబ్ది సంవత్సరపు వివిధ కార్యక్రమాలు, నిర్వహణలతో పాటు  ప్రచారాల గురించి ప్రణాళికలు సిద్ధం చేస్తారు.

సమావేశంలో జాతీయ అంశాలపై రెండు తీర్మానాలపై చర్చిస్తారు. అలాగే సంఘ్ శాఖల ద్వారా ఆశించే సామాజిక మార్పు పనులతో సహా ప్రత్యేకంగా పంచ పరివర్తన ప్రయత్నాల గురించి చర్చించే అవకాశాలు ఉన్నాయి. హిందుత్వ జాగరణతో సహా దేశంలోని ప్రస్తుత పరిస్థితుల విశ్లేషణతో పాటు చేయవలసిన పనుల గురించి కూడా సమావేశంలో చర్చిస్తారు.

సమావేశంలో సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలేతో పాటు ఇతర సహ కార్యవాహులు, కార్యవర్గ సభ్యులు పాల్గొంటారు. సమావేశంలో ముఖ్యంగా ఎన్నికైన ప్రతినిధులు, ప్రాంతం, క్షేత్ర స్థాయిలోని 1480 మంది కార్యకర్తలు పాల్గొంటారు. సమావేశంలో సంఘ్ ప్రేరేపిత వివిధ సంస్థల జాతీయ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సంస్థాగత మంత్రులు కూడా పాల్గొంటారు.