కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లుపై రాజ్యసభలో తీవ్ర దుమారం రేగిన విషయం మనకు తెలిసిందే. కాగా.. దానిని వ్యతిరేకిస్తూ.. విపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు.. డిప్యుటీ ఛైర్మన్ హరివంవ్ సింగ్ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. దీంతో.. ఈ ఘటనపై ఛైర్మన్ వెంకయ్యనాయుడు సీరియస్ అయ్యారు. సదరు ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్ చేశారు.

దీంతో.. సస్పెన్షన్ కి గురైన 8మంది రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. అయితే ఆ ఎంపీలందరూ మహాత్మాగాంధీ విగ్రహం సమీపంలోని గ్రీనరీలోనే రాత్రంతా గడిపారు. ఈ క్రమంలో తనపై దాడికి ప్రయత్నించిన వారికి డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఇంటినుంచి స్నాక్స్, టీ తీసుకుని వెళ్లారు. అంతేకాకుండా వారితో కలిసి కూర్చొని హరివంశ్ కాసేపు ముచ్చటించారు. తనపై వారంతా దాడి చేయడం వల్లే సస్పెన్షన్ కి గురయ్యారు. అయినప్పటికీ ఆయన మంచి మనసుతో.. సదరు ఎంపీలందరికీ టీ, స్నాక్స్ తీసువకుచ్చి తన మంచి మనసును చాటుకున్నారు. కాగా.. ఆ ఎంపీలు మాత్రం వాటిని తీసుకోవడానికి అంగీకరించలేదు. ఈ మేరకు సస్పెన్షన్ కి గురైన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ట్విట్టర్ లో స్పందించారు. తాము ఆ టీ, స్నాక్స్ తీసుకోవడం లేదని చెప్పారు.

 

కాగా.. ఈ విషయంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. తనపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతోపాటు.. అవమానించిన వారికి వ్యక్తిగతంగా డిప్యూటీ చైర్మన్ టీ తీసుకెళ్లడం నిజంగా ఆయన గొప్పతనానికి నిదర్శనమంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్ చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి గొప్ప సందేశం. ఈ విధంగా చేసినందరుకు వారిని అభినందిస్తున్నానంటూ ప్రదాని మోదీ ట్వీట్ చేశారు.