రూ. 2000 నోట్ల మార్పిడికి 5 రోజులే గడువు.. ఈ విషయాలు తెలుసుకోండి
రూ. 2000 నోట్ల మార్పిడికి గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. మరో ఐదు రోజులు మాత్రమే నోట్ల మార్పిడికి అవకాశం ఉన్నది. అయితే, ఈ వారంలో గురువారం ఒక రోజు బ్యాంకులకు సెలవు వస్తుండటం గమనార్హం.

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మే నెలలో రూ. 2000 నోట్ల చలామణి నిలిపేయాలని నిర్ణయం తీసుకుంది. ‘క్లీన్ నోట్ పాలసీ’ కింద రూ. 2000 నోట్లను మార్చుకోవాలని సూచనలు చేసింది. ఈ నోట్ల మార్పిడికి గడువు సెప్టెంబర్ 30వ తేదీతో ముగియనుంది. అంటే, రూ. 2000 నోట్లను మార్చుకోవాలంటే మరో ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మే 23వ తేదీ నుంచి మార్పిడికి ఆర్బీఐ అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ వారంలో గడువు ముగియనుంది. ఈ వారంలో బ్యాంకులు అన్ని రోజులు ఓపెన్‌గా ఉండవు. సోమవారం నుంచి బుధవారం వరకు బ్యాంకు సేవలు అందుబాటులో ఉంటాయి. గురువారం (సెప్టెంబర్ 28వ తేదీన) మిలాద్ ఉన్ నబీ సెలవు ఉన్నది. మళ్లీ శుక్రవారం, శనివారం బ్యాంకు సేవలు అందుబాటులోకి వస్తాయి. అంటే రూ. 2000 నోట్లను సెప్టెంబర్ 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మళ్లీ 29వ తేదీ, 30వ తేదీల్లో మార్చుకోవచ్చు.
Also Read: వయనాడ్ నుంచి కాదు.. హైదరాబాద్ నుంచి పోటీ చేసి గెలవాలి - రాహుల్ గాంధీకి ఒవైసీ అసదుద్దీన్ సవాల్..
రూ. 20 వేల విలువైన రూ. 2000 నోట్ల ను ఏ బ్యాంకులోనైనా మార్చుకోవచ్చు. సాధారణ సేవింగ్స్, జన్ ధన్ ఖాతాల్లో పరిమితులేమీ లేకున్నా.. రూ. 50 వేలకు పైబడితే మాత్రం ఐటీ నిబంధనల ప్రకారం పాన్ వివరాలు సమర్పించాలి.