కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బాసనగౌడ పాటిల్ యత్నాల్ శుక్రవారం సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ నుంచి కొందరు పవర్ బ్రోకర్లు తనను చేరారని, సీఎం పదవి కావాలంటే రూ. 2,500 కోట్లు ఇవ్వాలని ఓ డీల్ మాట్లాడరని బాంబు పేల్చారు. అంతేకాదు, రాష్ట్రంలోని పార్టీ టాప్ లీడర్లు అందరూ పరోక్షంగా ఒకరికి ఇంకొకరు సహకరించుకుంటారని వివరించారు. 

బెంగళూరు: తరుచూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే బాసనగౌడ పాటిల్ యత్నాల్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. కొంతమంది పవర్ బ్రోకర్లు ఢిల్లీ నుంచి తన వద్దకు వచ్చారని వివరించారు. రాష్ట్ర సీఎం కావాలంటే రూ. 2,500 కోట్లు ఇవ్వాలని, ఆ మొత్తం అందిస్తే రాష్ట్ర సీఎంగా అవుతారని ఆఫర్ ఇచ్చారని తెలిపారు. బెలగావి జిల్లాలోని రామదుర్గ్‌లో పంచమశాలి కమ్యూనిటీ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఈ
వ్యాఖ్యలు చేశారు. 

ఢిల్లీ నుంచి కొందరు బ్రోకర్లు తన వద్దకు వచ్చారని, వారికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చాలా దగ్గర అని చెప్పారని పేర్కొన్నారు. రూ. 2,500 కోట్లు ఇస్తే తనను సీఎంగా చేసి కూర్చోబెడతామని నమ్మబలికారన్నారు. కానీ, తాను ఆ ఆఫర్‌ను తిరస్కరించానని, అసలు రూ. 2,500 కోట్టు అంటే ఎన్ని నోట్లు ఉంటాయో కూడా తనకు తెలియదని, అంతటి డబ్బును ఎవరైనా ఎక్కడ పెడతారని అడిగానని చెప్పారు.

కర్ణాటక కాంగ్రెస్ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ వెంటనే ఆయన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. రూ. 2,500 కోట్లకు సీఎం కుర్చీ, రూ. 100 కోట్లకు సీఎం పదవి ఇస్తారని ఆయన పేర్కొన్నారని వివరించారు. యత్నాల్ మాజీ కేంద్రమంత్రి అని, ఆయన మాటలను సింపుల్‌గా తీసుకోరాదని కోరారు.

ఈ ఆఫర్ వ్యాఖ్యలే కాదు.. అన్ని పార్టీల టాప్ నేతలు ఒకరి కోసం మరొకరు అడ్జస్ట్ అయ్యే పాలిటిక్స్ చేసుకుంటారని బీజేపీ ఎమ్మెల్యే యత్నాల్ ఆరోపించారు. బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప, కాంగ్రెస్ సీనియర్లు సిద్దారామయ్య, డీకే శివకుమార్, జేడీఎస్ నుంచి దేవేగౌడ, హెచ్‌డీ కుమారస్వామిలు పరస్పరం ఒకరికొకరు పరోక్షంగా సహకరించుకుంటారని తెలిపారు. వారిలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఒకరికి మరొకరు అనుకూలంగా వ్యవహరించుకుంటారని సంచలన ఆరోపణలు చేశారు. ఇదే విషయాన్ని తాను అసెంబ్లీలో కూడా చెప్పానని తెలిపారు.

తనలాంటి ఎమ్మెల్యేలు పిచ్చివాళ్ల తరహాలోనే వెనుక సీట్లలో కూర్చుని తమ పార్టీ నాయకుడిని మోస్తూ ఉండాలని అన్నారు. సీఎంగా బీజేపీ నేత యడియూరప్ప ఉన్నప్పుడు అత్యధిక గ్రాంట్లు తన నియోజకవర్గం షికారిపుర తర్వాత పెద్ద మొత్తంలో గ్రాంట్లు సిద్దారామయ్య నియోజకవర్గం బాదామి, ఆ తర్వాత శివకుమార్ నియోజకవర్గానికే వెళ్లాయని పేర్కొన్నారు. తాను సమస్యలు లేవనెత్తిన తర్వాత సీఎం బొమ్మై తన నియోజకవర్గానికి రూ. 500 కోట్లు మంజూరు చేశాడని వివరించారు.