Asianet News TeluguAsianet News Telugu

మహిళలను గర్భవతిని చేస్తే రూ.13 లక్షల పారితోషికం.. ఆఫర్ బాగుందని వెళ్తే ఇక అంతే సంగతి..

బీహార్ లోని నవాడా జిల్లాలో 'ఆల్ ఇండియా ప్రెగ్నెన్సీ జాబ్ ఏజెన్సీ' పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మహిళలకు గర్భం దాల్చేలా చేస్తే రూ.13 లక్షలు చెల్లిస్తామని చెప్పి ఈ మూఠా కొత్త దందాకు తెరతీసింది.

Rs. 13 lakh reward for making women pregnant.. A new scam has come to light in Bihar..ISR
Author
First Published Jan 3, 2024, 1:14 PM IST

సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. ప్రతీ రోజూ కొత్త రకాల మోసాలతో అమాయకుల జేబులు గుల్ల చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి మరీ మోసాలకు దిగుతున్నారు. పెరిగిన సాంకేతికతను ఉపయోగించుకొని ఈ మోసాలకు పాల్పడుతున్నారు. మొబైల్స్ కు వచ్చే ఓటీపీలు తెలుసుకొని, లింక్స్ లో మాల్ వేర్ పంపి, మొబైల్ హ్యాక్ చేసి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకోవడం వంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. 

అయితే బీహార్ లోని నవాడాలో చాలా ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. మహిళలను గర్భం దాల్చేలా చేస్తే లక్షలు రూపాయిలు ఇస్తామని చెప్పి మోసాలకు పాల్పడుతున్నారు. దీని కోసం సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తున్నారు. నమ్మి వెళ్లిన వారిని నిలువునా ముంచెస్తున్నారు. ఇలాంటి సిండికేట్ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉంది. అయితే బీహార్ లో తాజాగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న 8 మంది సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు.

నవాడ జిల్లాలోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు దాడులు చేసి మోసగాళ్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 9 మొబైల్స్, 1 ప్రింటర్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నిందితులు ఆల్ ఇండియా ప్రెగ్నెన్సీ జాబ్ (బేబీ బర్త్ సర్వీస్) పేరుతో డబ్బు ఎర చూపి ప్రజలను మోసాలకు గురిచేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. 

ఎలా మోసం చేస్తున్నారంటే ? 
ఎనిమిది మందితో కూడిన ఈ ముఠా ముందుగా సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తోంది. ఇందులో పిల్లలు లేకుండా బాధపడుతున్న ధనవంతుల మహిళలకు గర్భం దాల్చేలా చేస్తే రూ.13 లక్షలు ఇస్తామని ఆఫర్ పెడుతున్నారు. ఒక వేళ మహిళ గర్భం దాల్చకపోయినా ప్రోత్సాహకంగా రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇస్తున్నారు. ఈ ఆఫర్ నచ్చిన వారు జస్ట్ రూ.799 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ఏజెన్సీలో రిజిస్టర్ చేసుకోవాలని సూచిస్తున్నారు. 

ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులకు.. గర్భం దాల్చాలని భావిస్తున్న మహిళల ఫొటోలు పంపిస్తారు. అందులో ఎంచుకున్న మహిళ అందాన్ని బట్టి రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని చెబుతారు. ఒక సారి రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులు ఇలా వేలకు వేలు చెల్లించేస్తున్నారు. చివరికి ఇది ఫేక్ ఏజెన్సీ అని తెలిసి లబోదిబోమంటున్నారు.

ఇలాంటి స్కామ్ లో చిక్కి, మోసపోయిన చాలా మంది బయటకు చెప్పుకోలేకపోవడం వల్ల సైబర్ మోసగాళ్ల ఆటలు బాగానే సాగాయి. కానీ దీనిపై పోలీసులకు రహస్య సమాచారం అందడంతో దాడులు జరిపి 8 మందిని అరెస్టు చేశారు. కానీ ఈ స్కామ్ వెనక సుత్రాధారి అయిన మున్నా కుమార్ ఇంకా పోలీసులకు చిక్కలేదు. పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios