ఎన్నో ప్రజాకర్షక నిర్ణయాలు తీసుకుంటున్న తమిళనాడు ప్రభుత్వం మరో కొత్త పథకానికి నాంది చుట్టింది. బాలికల విద్యను ప్రోత్సహించడానికి వారికి నెలకు రూ.1000 అందించనుంది. ఈ పథకం ద్వారా తమిళనాడులో సుమారు 6 లక్షల మంది విద్యార్థిణులకు లబ్ది చేకూరనుంది. 

తమిళనాడులోని స్టాలిన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థిణులకు వారి ఉన్నత విద్యను అభ్యసించేందుకు నెలకు రూ.1000 ప్రోత్సాహకంగా అందించాలని నిర్ణయించారు. ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం శుక్ర‌వారం ప్ర‌క‌టించింది. దీంతో ఎంతో మంది బాలికల‌కు ల‌బ్ది చేకూర‌నుంది. 

తమిళనాడు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికల ఉన్న‌త విద్యను ప్రోత్సహించడానికి, వారికి సహాయం చేయడానికి నెలవారీగా డ‌బ్బు డిపాజిట్ చేయనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగ రాజన్ శుక్ర‌వారం అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ ప‌థ‌కం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన బాలికల బ్యాంకు ఖాతాల్లో రూ.1000 జమ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం ఈ పథకం ద్వారా సుమారు 6 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. 

ఈ పథకం కోసం మొత్తం రూ.698 కోట్లు కేటాయించారు. ఉన్నత విద్యలో ప్రభుత్వ పాఠశాలల ప్ర‌వేశాన్ని పెంచ‌డానికి ఈ ప‌థ‌కం ఉప‌యోగ‌పడుతుంది. ‘‘మూవలూరు రామామృతం అమ్మాయార్ స్మారక వివాహ సహాయ పథకం ’’ అని గతంలో పిలిచే పథకాన్ని మారుస్తున్నట్టు తమిళనాడు ఆర్థిక మంత్రి రాజన్ తెలిపారు. ఇప్పుడు దీనిని ‘‘ మూవలూరు రామామృతం అమ్మాయార్ ఉన్నత విద్యా భరోసా పథకం ’’ పిలుస్తున్నట్టు చెప్పారు. 

స్టాలిన్ నేతృత్వంలోని స‌ర్కార్ ప్ర‌క‌టించిన వివ‌రాల ప్ర‌కారం.. ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుండి 12 తరగతుల బాలికలందరికీ వారి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిప్లొమా, ITI కోర్సులు నిరంతరాయంగా పూర్తయ్యే వరకు వారి బ్యాంకు ఖాతాలలో నెల‌కు వెయ్యి రూపాయిలు జ‌మ అవుతాయి. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న స్కాల‌ర్ షిప్ ల‌తో పాటు ఈ ప‌థ‌కం ద్వారా కూడా విద్యార్థులు ల‌బ్దిపొందుతారు అని మంత్రి తెలిపారు. 

EVR మణిఅమ్మయ్యర్ స్మారక వితంతు కుమార్తె వివాహ సహాయ పథకం, డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి స్మారక కులాంతర వివాహ సహాయ పథకం, అన్నై తెరాస అనాథ బాలికల వివాహ సహాయ పథకం, డాక్టర్ ధర్మాంబళ్ అమ్మయ్యర్ స్మారక వితంతువు స్మారక వితంతువుల సహాయ పథకం వంటి పథకాలు కొనసాగుతాయని మంత్రి తెలిపారు. వీటిలో ప‌లు మార్పులు అమ‌లు చేస్తామ‌ని చెప్పారు.