ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ ఎన్డీ తివారి కుమారుడు రోహిత్‌ (39) హఠాన్మరణం చెందారు. మంగళవారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు.

2008 వరకు రోహిత్ తివారి కొడుకు అన్న విషయం ఎవరికీ తెలియదు. తాను ఎన్డీ తివారి కుమారుడినంటూ 2008లో తెరమీదకొచ్చి సంచలనం సృష్టించిన ఆయన.. ఈ విషయాన్ని అంగీకరించాలంటూ తివారిపై సుదీర్ఘ న్యాయపోరాటం చేసి విజయం సాధించారు. రోహిత్‌.. ఢిల్లీలోని డిఫెన్స్‌ కాలనీలో తల్లి ఉజ్వలా శర్మ, భార్యతో కలిసి ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం 4:45 గంటలకు గుండెపోటుతో కుప్పకూలాడు.

కాగా రోహిత్‌ను తల్లి, భార్య హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతిచెందారని పోలీసులు పేర్కొన్నారు. కాగా, గత ఏడాది తివారి (92) మృతిచెందిన అనంతరం.. తన తండ్రికి స్మారక స్తూపాలు నిర్మించాలని, ప్రభుత్వ పథకాలకు ఆయన పేరు పెట్టాలని రోహిత్‌.. కేంద్రంతో పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు.