ఆంధ్రప్రదేశ్‌ మాజీ గవర్నర్‌, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారి కుమారుడు రోహిత్ ది సహజ మరణం కాదని.. హత్య అని తేలింది. పథకం ప్రకారం ఆయనను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. రోహిత్ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా.. గుండెపోటుతో మరణించారని అందరూ భావించారు. అయితే.. ముఖం మీద దిండేసి ఒత్తి, ఊపిరాడకుండా చేసి చంపేసినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడయింది. గొంతు నులమడం, ఊపిరి అందకుండా చేయడం ద్వారా రోహిత్‌ను హత్య చేశారని ఆ నివేదిక తేల్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రోహిత్‌ ఉత్తరాఖండ్‌లోని హల్దవానీలో తల్లి ఉజ్వల, భార్య అపూర్వతో కలిసి ఉంటున్నారు.కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకొని, సోమవారం ఉదయం ఢిల్లీకి ఆయన వచ్చారు. సమీప బంధువు దీపక్‌ భలూటియా ఇంట్లో ఉంటూ, పార్టీ చేరికకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఇంతలో అకస్మాత్తుగా రోహిత్‌ తీవ్ర అస్వస్థతకు గురయినట్టు ఆ బంధువు చెబుతుండగా, ఆ ఇంట్లోనే చంపేసి, ఆ తరువాత ఆస్పత్రికి తీసుకెళ్లారనేది పోలీసుల వాదన. 

మంగళవారం రాత్రి 11.30 గంటలకు రోహిత్‌ భోజనం చేసి, నిద్రకు ఉపక్రమించారని, ఆ సమయంలో ఆయన మద్యం తీసుకొన్నారని, హత్య సరిగ్గా బుధవారం తెల్లవారుజామున 1.30 గంటలకు జరిగిందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. అప్పటిదాకా ఆయనతో ఉన్నవారే ఈ హత్యకు పాల్పడ్డారని ఈ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ హత్య వెనుక పోలీసుల హస్తం కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.