ఎన్నికల ప్రచారంలోనూ, రాజకీయాల్లోనూ ఇలా ప్రతీ అంశంలోనూ తన పేరు ఎందుకు లాగుతారంటూ లేఖలో ప్రశ్నించారు. తనను ఎన్నిసార్లు విచారించినా, నోటీసులు ఇచ్చినా తన మీద చేసిన ఒక్క ఆరోపణ కూడా రుజువు కాలేదని రాబర్ట్ వాద్రా లేఖలో స్పష్టం చేశారు.
ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోదీకి ఘాటు లేఖ రాశారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా. హర్యానాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాబర్ట్ వాద్రాను జైలకు పంపిస్తామంటూ చేసిన వ్యాఖ్యలకు ఆయన గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
ఎన్నికల ప్రచారంలోనూ, రాజకీయాల్లోనూ ఇలా ప్రతీ అంశంలోనూ తన పేరు ఎందుకు లాగుతారంటూ లేఖలో ప్రశ్నించారు. తనను ఎన్నిసార్లు విచారించినా, నోటీసులు ఇచ్చినా తన మీద చేసిన ఒక్క ఆరోపణ కూడా రుజువు కాలేదని రాబర్ట్ వాద్రా లేఖలో స్పష్టం చేశారు.
దేశంలో ఎన్నో సమస్యలు ఉండగా, వాటిని వదిలేసి కేవలం తనను మాత్రమే టార్గెట్ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. మీ ఎన్నికల ర్యాలీలో మళ్లీ నాపేరు వినిపించడం నన్ను షాక్‌కి గురి చేసింది.
దేశంలో పేదరికం, మహిళా సాధికారత, నిరుద్యోగం లాంటి చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ వదిలేసి మీరు నా గురించి మాట్లాడారు. గత ఐదేళ్లుగా మీ ప్రభుత్వం నన్ను వేధిస్తూనే ఉంది. కోర్టులు, ఐటీ, ఈడీ లాంటి ప్రభుత్వ సంస్థలు, ఇతర ఏజెన్సీల నుంచి వరుసగా నోటీసులు పంపి నన్ను మానసికంగా ఒత్తిడి చేయాలని చూశారు.
ఇప్పటి వరకు 11 నోటీసులు పంపారు. ఈడీ లాంటి సంస్థలు నన్ను 8 గంటల నుంచి 11 గంటల పాటు నన్ను ప్రశ్నించారు. దేశంలోని వివిధ నగరాల్లో నా మీద విచారణ జరిపించారు. అయినా, ఒక్కదాంట్లో కూడా నా మీద ఆరోపణలను రుజువు చేయలేకపోయారు.
పదే పదే నా మీద ఆరోపణలు చేయడం ద్వారా మీరు ఏం సాధించారో కానీ నాకైతే ఆశ్చర్యంగా ఉంది అంటూ లేఖలో రాబర్ట్ వాద్రా పలు ప్రశ్నాస్త్రాలు సంధించారు. పరిపాలనలో విఫలమైన మోదీ ప్రభుత్వం ఎన్నికల్లో తన పేరు వాడుకోవడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందనే విషయం దేశం మొత్తానికీ తెలుసని రాబర్ట్ వాద్రా స్పష్టం చేశారు.
దయచేసి నా మీద వ్యక్తిగత దాడి ఆపండి. అలాంటి వ్యాఖ్యలు చేసి గౌరవ న్యాయవ్యవస్థను కించపరచొద్దు. నాకు భారతీయ న్యాయవ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉంది. నిజం గెలుస్తుంది. ఈ దేశ ప్రజలను ఆ దేవుడే కాపాడాలి అంటూ రాబర్ట్ వాద్రా మోదీకి లేఖలో విజ్ఞప్తి చేశారు.
