హర్యానాకు చెందిన బీజేపీ నేత, టిక్‌టాక్‌ స్టార్‌ సొనాలీ ఫొగాట్‌ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇందుకు సంబంధించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 9న తన ఇంటికి తాళం వేసి చండీగఢ్‌కు వెళ్లానని.. ఫిబ్రవరి 15న తిరిగి వచ్చేసరికి తాళాలు పగలగొట్టి ఉన్నాయని సోనాలీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

బంగారం, వెండి ఆభరణాలు, రూ.10 లక్షల నగదు, లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌‌ను దొంగలు ఎత్తుకెళ్లారని వెల్లడించారు. మరోవైపు, సొనాలీ ఇంటి వద్ద సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ.. దొంగలు డిజిటల్‌ వీడియో రికార్డర్‌ (డీవీఆర్‌)లో ఉన్న ఫుటేజీని కూడా తమతో పాటు తీసుకెళ్లడంతో నిందితులను గుర్తించడం కష్టంగా మారింది.

కాగా, 2019లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అదంపూర్‌ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన సొనాలీ ఫొగాట్‌.. కాంగ్రెస్‌ అభ్యర్థి చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.