దొంగిలించడానికి మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళ్లారు. బాగానే చోరీ చేసి డబ్బు, నగలను పోగు చేశారు. కానీ, ఓ చోట దొంగతనం పూర్తి చేసుకుని తిగిరి వెళ్లుతుండగా వారి దారికి ఓ పిల్లి ఎదురొచ్చింది. దీన్ని అపశకునంగా భావించి కాసేపు అక్కడే ఆగిపోయారు. పర్యవసానంగా వారు పోలీసులకు దొరికిపోయారు.
న్యూఢిల్లీ: ఇప్పటికీ మూఢనమ్మకాలు ప్రబలంగా ఉన్నాయి. అదో మానసిక జబ్బు. దీనికి మంచి వారు చెడ్డవారు అనే తేడా లేదు. ఎవరికైనా అంధ విశ్వాసాలు ఉండొచ్చు. తలపెట్టేదే ఓ పాపకార్యం.. దానికి మళ్లీ పట్టింపులు. ఆ ముగ్గురు గజ దొంగల పరిస్థితి ఇదే. పోలీసులకు చిక్కకుండా హస్తలాఘవంతో పలు చోరీలు విజయవంతంగా చేశారు. అయితే.. చివరి దొంగతనంలో మాత్రం మూఢనమ్మకంతో పోలీసుల చేతికి చిక్కారు. ఓ చోట దొంగతనం చేసి పారిపోతుండగా పిల్లి అడ్డొచ్చిందని, అపశకనంతో తమకేమైనా జరగొచ్చని కాసేపు ఆగిపోయారు. అంతే.. పోలీసులకు చిక్కి జైలుపాలయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో చోటుచేసుకుంది.
ఝాన్సీలో కొన్ని రోజులుగా దొంగలు చేతివాటం చూపిస్తున్నారు. చోరీల కేసులు పెరుగుతున్నాయి. కానీ, దొంగలు దొరకడం లేదు. యూపీ పోలీసులకు వీరిని పట్టుకోవడం ఓ సవాల్‌గా మారిపోయింది. అయితే.. ఆ ముఠా చివరి చోరీలో పిల్లి అడ్డొస్తే అపశకునం అనే నమ్మకంతో కదలకుండా ఉండిపోయారు. ఇంతలో పోలీసులు స్పాట్‌కు రావడంతో చిక్కిపోయారు. ఈ ముగ్గురు మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. అమిత్ పాఠక్ సోను, సైనిక్, రాహుల్ సేన్‌లుగా ఆ దొంగల ముఠాను గుర్తించారు. వారి నుంచి డబ్బు, నగలను పెద్ద మొత్తంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: ఎన్నికల ముందు పెట్రోల్ రేట్లు తగ్గిస్తారా?: ఇదీ కేంద్రమంత్రి సమాధానం
ఈ దొంగలను విచారింగానే.. ఈ ఆసక్తికర విషయం బయటపడింది. తాము దొంగతనం పూర్తి చేసుకుని తిరిగి వెళ్లుతుండగా తమకు ఓ పిల్లి ఎదురైందని, దాంతో తమకు చెడు జరుగుతుందని భయపడి పారిపోకుండా అక్కడే నిలబడిపోయామని ఓ దొంగ చెప్పాడు. ఝాన్సీలో జరిగిన పలు చోరీలలో వీరి ప్రమేయం ఉన్నదని పోలీసులు అనుమానిస్తున్నారు.
