ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన ఓ బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యింది. భాగా ఎత్తు నుండి బస్సు లోయలోకి పడిపోవడంతో ఈ ప్రమాద మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది.

ఉత్తరాఖండ్ రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఓ బస్సు రిషికేష్-గంగోత్రి హైవేపై ప్రయాణిస్తుండగా అదుపుతప్పి లోయలో పడిపోయింది. దాదాపు 250 మీటర్ల లోతున్న లోయలో పడిపోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో పదిమంది మృత్యువాతపడినట్లు సమాచారం. మరో 9 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కూడా చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

అయితే ఈ ప్రమాదం నుండి కొంతమంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బైటపడ్డారు. ప్రమాదానికి గురైన సమయంలో బస్సులో మొత్తం 25 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాల ద్వారా గాయపడ్డ ప్రయాణికులను కాపాడటంతో పాటు, మృతదేహాలను బైటికి తీస్తున్నారు. ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.