Asianet News TeluguAsianet News Telugu

కేర‌ళ‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఐదుగురు విద్యార్థులు స‌హా 9 మంది మృతి

Road Accident: ఎర్నాకులం జిల్లాలోని బసేలియోస్ విద్యానికేతన్‌కు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులను ఎక్కించుకుని టూరిస్ట్ బస్సు ఊటీకి వెళ్తోంది. అయితే, పాలక్కాడ్ జిల్లాలో ప్రమాదానికి గురై 9 మంది మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు. 
 

Road accident in Kerala 9 people including five students
Author
First Published Oct 6, 2022, 9:44 AM IST

Kerala KSRTC bus Accident: విద్యార్థుల‌తో వెళ్తున్న ఒక స్కూల్ బ‌స్సు ప్ర‌భుత్వ రోడ్డు ర‌వాణా సంస్థకు చెందిన బ‌స్సును ఓవ‌ర్ టేక్ చేయ‌బోయి అదుపుత‌ప్పి ఢీ కోట్టింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఐదుగురు విద్యార్థులు స‌హా మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 40 మంది గాయ‌ప‌డ్డారు. ఈ విషాద ఘ‌ట‌న కేర‌ళ‌లో చోటుచేసుకుంది. స‌మాచారం అందుకున్న అధికారులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టి.. క్ష‌త‌గాత్రులను స్థానికంగా ఉన్న ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 

వివ‌రాల్లోకెళ్తే.. ఎర్నాకులంలోని ముళంతురుత్తిలోని బేసిలియస్ స్కూల్ నుండి విద్యార్థులను తీసుకెళ్తున్న టూరిస్ట్ బస్సు గురువారం కేర‌ళ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (కేఎస్‌ఆర్‌టీసీ) బస్సును ఢీకొనడంతో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. వడక్కంచెరిలో ఈ ప్రమాదం జ‌రిగింది. చ‌నిపోయిన వారిలో ఐదుగురు విద్యార్థులు కూడా ఉన్నారు. కారును ఓవర్‌టేక్‌ చేస్తుండగా టూరిస్ట్‌ బస్సు అదుపు తప్పి కేఎస్‌ఆర్‌టీసీ బస్సును ఢీకొట్టిందని స‌మాచారం. టూరిస్ట్ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న వాగులో పడి బోల్తా కొట్టింది. వలయార్-వడక్కంచెరి జాతీయ రహదారిపై అంజుమూర్తి మంగళం బస్టాప్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

గురువారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్రగాయాలు అయ్యియి. మ‌రో 28 మందికి స్వల్ప గాయాలయ్యాయి. మొత్తం 40 మంది  గాయ‌ప‌డ్డారు. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం. టూరిస్ట్ బస్సులో 41 మంది విద్యార్థులు, ఐదుగురు ఉపాధ్యాయులు, ఇద్దరు ఉద్యోగులు ఉన్నారు. అలాగే, కేఎస్ఆర్టీసీ బస్సులో 49 మంది ప్రయాణికులు ఉన్నారు.

Road accident in Kerala 9 people including five students

ప్రాణనష్టం పెరిగే అవకాశముంది.. 

ఈ ప్రమాదంలో ఇప్ప‌టికే తొమ్మిది మంది చ‌నిపోయారు. మృతుల సంఖ్య మ‌రింత‌గా పెరిగే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం. ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డవారిని చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుల్లో కేఎస్ఆర్టీసీ బస్సు ప్ర‌యాణికుల్లో ముగ్గురు, ఆరుగురు టూరిస్ట్ బస్సు ప్రయాణికులు ఉన్నారు. చ‌నిపోయిన వారిలో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతుల్లో KSRTC ప్రయాణికులు త్రిసూర్‌కు చెందిన రోహిత్ రాజ్ (24), కొల్లంకు చెందిన ఓ అనూప్ (22), పాఠశాల ఉద్యోగులు నాన్సీ జార్జ్, వీకే విష్ణు ఉన్నారు. 

క్షతగాత్రులను పాలక్కాడ్ జిల్లా ఆసుపత్రిలో చేర్పించిన పోలీసులు.. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మృతుల మృతదేహాలు అలత్తూర్, పాలక్కాడ్ ఆసుపత్రులలో ఉన్నాయి. త్రిసూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 16 మందిలో హరికృష్ణన్ (22), అమేయ (17), శ్రద్ధ (15), అనీజ (15), అమృత 915), తాన్‌శ్రీ (15), హైన్ జోసెఫ్ (15), ఆశా (40), జనీమా (15), అరుణ్‌కుమార్ (38), బ్లెసన్ (18), ఎల్సిల్ (18), ఎల్సా (18)లు ఉన్నారు. 

Road accident in Kerala 9 people including five students

ప్ర‌మాదానికి టూరిస్ట్ బస్సు ఓవ‌ర్ స్పీడ్ కార‌ణం.. ? 

బేసిలియస్ స్కూల్‌లోని 10, 11, 12 తరగతుల విద్యార్థులు విహార‌యాత్ర‌కు వెళ్తున్నారు. వారు విశ్రాంతి కోసం ఊటీకి వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. ఈ బృందంలో 26 మంది బాలురు, 16 మంది బాలికలు ఉన్నారు. వర్షం కారణంగా ప్రమాద తీవ్రత పెరిగింది. టూరిస్ట్ బస్సులో ఉన్న ప్రయాణికులను బస్సును క‌ట్ చేసి బయటకు తీశారు. ఇక కేఎస్ఆర్టీసీ బ‌స్సు కొట్టారక్కరా నుండి కోయంబత్తూర్ వెళుతోంది. టూరిస్ట్ బస్సు ఓవర్ స్పీడ్ గా ఉంది ' అని కేఎస్ఆర్టీసీ డ్రైవర్ సుమేష్ చెప్పిన‌ట్టు  మనోరమ న్యూస్ నివేదించింది. ఇదే విషయాన్ని విద్యార్థులు కూడా సమర్థించారు.

అదుపు తప్పి దూసుకెళ్లిన కేఎస్‌ఆర్‌టీసీ బస్సు తీవ్ర ప్రయత్నం తర్వాత నిలదొక్కుకుంది. లేకుంటే పెనుప్ర‌మాద‌మే జ‌రిగేద‌ని ప్ర‌త్య‌క్ష సాక్షులు చెప్పారు. "వెలంకన్ని పర్యటన తర్వాత టూరిస్ట్ బస్సు డ్రైవర్ అలసిపోయాడు" అని ఒక పేరెంట్ చెప్పిన‌ట్టు మనోరమ న్యూస్ నివేదించింది. మృతుల పోస్టుమార్టం ప్రక్రియను వేగవంతం చేస్తామని మంత్రి ఎంబీ రాజేష్ తెలిపారు. "రెవెన్యూ మంత్రి, పాలక్కాడ్ జిల్లా కలెక్టర్ పనిని సమన్వయం చేస్తున్నారు. పాలక్కాడ్‌లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం సాధార‌ణంగా ఉంది" అని ఆయన తెలిపారు. పోలీసులు, స్థానికుల సహకారంతో సహాయక చర్యలు చేప‌ట్టారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios